
టీఎంసీలో తిరుగుబాటు.. మమత పట్టు బలహీనతకు నిదర్శనం: బీజేపీ నేత ఎన్వీ సుభాష్
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ వ్యాఖ్యానించారు. టీఎంసీకి చెందిన రెబెల్ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనం కావడంతో పాటు ఎన్డీయేకు మద్దతు ప్రకటించడం పార్టీ అంతర్గత సంక్షోభాన్ని బహిర్గతం చేస్తోందని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన సుభాష్, పార్టీ నాయకత్వం సభ్యులకు ప్రజాస్వామ్య వాతావరణం కల్పించడంలో విఫలమవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మమతా బెనర్జీపై ప్రజలతో పాటు పార్టీ నాయకుల్లోనూ విశ్వాసం తగ్గుతోందని, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. లోక్‌సభలో, అసెంబ్లీలో ప్రత్యేకంగా కూర్చోవడానికి రెబెల్ నేతలు స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశారని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని పలువురు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారని సుభాష్ అన్నారు.
రెబెల్ ఎంపీలు కొత్త పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్న చట్టపరమైన ఇబ్బందుల కారణంగా ఎన్‌సీపీఐతో కలవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన విమర్శలను సుభాష్ కొట్టిపారేశారు. టీఎంసీలో నెలకొన్న అసంతృప్తి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు గుడ్లతో దాడి చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఆయన కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపించిన ఘోష్, దాడికి బీజేపీ కార్యకర్తలే బాధ్యులని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
