
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. సంస్థ మనుగడను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
మంగళవారం జరిగిన ఒక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఇవి మినహా మిగిలిన అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ గోడును చెప్పుకోవడానికి ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
విలీనంపై స్పష్టత
ఆర్టీసీ విలీనంపై గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 9న కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఎన్నికలకు ముందు తొందరపాటుగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిందని మంత్రి గుర్తుచేశారు. వరుస ఎన్నికల కోడ్ అనంతరం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వరుసగా రావడంతో ఈ అంశాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లలేకపోయామని మంత్రి వివరించారు.
సంక్షేమ చర్యలు, ఆర్థిక వెసులుబాటు
ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం డీఏ బకాయిలు లేవని అన్నారు. పీఆర్‌సీ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన ఆదాయంతో సంస్థ ఆర్థికంగా బలపడిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.1205 కోట్ల నుంచి రూ. 600 కోట్లకు, సీసీఎస్ బకాయిలను రూ. 690 కోట్ల నుంచి రూ.300 కోట్లకు తగ్గించగలిగామని వివరించారు. సంస్థలో ఇప్పటికే 1,134 కారుణ్య నియామకాలు చేపట్టామని, కొత్త ఉద్యోగాల భర్తీకి పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే కొత్త సిబ్బంది విధుల్లో చేరుతారని తెలిపారు.
మహాలక్ష్మి పథకం - ఆర్టీసీ పునరుజ్జీవం
ప్రస్తుతం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ సేవలు మరింత బలోపేతం అయ్యాయని చెప్పారు. ఒకప్పుడు మనుగడ కోసం పోరాడిన ఆర్టీసీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల నేడు కోలుకుంటోందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని, సంస్థను బలోపేతం చేసేందుకు 2,978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.
ప్రభుత్వం మూడు ముఖ్య అంశాలకు ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. అవి ఆర్టీసీ సంస్థ రక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ స్థిరీకరణ దశలో ఉన్న నేపథ్యంలో సమ్మెకు వెళ్లడం సరైంది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా సంస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి ఆర్టీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
