
చదువే ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం: మంత్రి సీతక్క
చదువు అనేది ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టరేట్‌లో నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం, అంగన్వాడీ యూనిఫార్ముల పంపిణీ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవితంలో అన్నీ కోల్పోయినా చదువు ఉంటే మళ్లీ నిలదొక్కుకునే శక్తి లభిస్తుందని అన్నారు. బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి ఉన్నత పదవులను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. నెల్సన్ మండేలా చెప్పిన “ప్రపంచాన్ని మార్చగల శక్తి విద్యకే ఉంది” అనే సూక్తిని ప్రస్తావిస్తూ విద్యతో పాటు సంస్కారం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం సమాజంతో మమేకమవడం బాధ్యతాయుత పౌరులుగా ఎదగడం అవసరమన్నారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది టీనేజ్ బాలికలను పదివేలకు పైగా స్నేహ సంఘాలుగా ఏర్పాటు చేసి భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, సాధికారత అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారకుండా విద్యాభ్యాసం, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపుకు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. పెళ్లి అయినా వృద్ధాప్యం వచ్చినా వ్యక్తితో పాటు ఉండేది విద్య, విజ్ఞానం మాత్రమేనని పేర్కొంటూ ప్రతి బాలిక తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంగన్వాడీ యూనిఫార్ముల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో ఐసీడీఎస్ సేవల బీజం మహబూబ్‌నగర్ జిల్లాలోనే పడిందని గుర్తు చేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చిన్నారులకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఐసీడీఎస్ సేవలను ప్రారంభించారని తెలిపారు
గర్భధారణ దశ నుంచి మూడేళ్ల వయస్సు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గతంలో లేని యూనిఫార్ములను ప్రస్తుతం అందిస్తున్నామని 57 రకాల విద్యా, ఆట వస్తువులను పంపిణీ చేస్తున్నామని “తొలి ముద్ద” కార్యక్రమం ద్వారా చిన్నారులకు అల్పాహారం, పాలు, గుడ్లు, పోషకాహారం అందిస్తున్నామని వివరించారు. ప్రైవేట్ నర్సరీల్లో లభించని అనేక సౌకర్యాలు ప్రభుత్వ అంగన్వాడీల్లో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇకపోతే మహిళల అక్షరాస్యత పెంపు కోసం చేపట్టిన “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం ద్వారా లక్షలాది మంది మహిళలు చదవడం, రాయడం నేర్చుకుని వేలిముద్రకు బదులుగా సంతకం చేసే స్థాయికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహిళా కమిషన్ సభ్యురాలు సదాలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
