Let's talk: editor@tmv.in
రాయలసీమ ఇకపై రక్షణ సీమ

రాయలసీమ ఇకపై రక్షణ సీమ

Panthagani Anusha
15 మే, 2026

రాయలసీమ అభివృద్ధి ప్రయాణం మరో చారిత్రక మలుపు తిరగబోతోంది. ఒకప్పుడు ‘రతనాల సీమగా వెలిగి ప్రస్తుతం ‘ఉద్యాన సీమగా విరాజిల్లుతున్న ఈ ప్రాంతం భవిష్యత్తులో దేశ రక్షణ రంగానికి గుండెకాయగా మారి ‘రక్షణ సీమగా అవతరించనుంది. ఇరిగేషన్, సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో ఇప్పటికే దూసుకుపోతున్న సీమలో తాజాగా రక్షణ డ్రోన్ రంగాలు సరికొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనున్నాయి.

భారత రక్షణ రంగంలో నూతన అధ్యాయం

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా నేడు దేశ రక్షణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భూమి పూజ చేయనున్నారు. సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్‌డీఓ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ కావడం విశేషం.

అత్యాధునిక సాంకేతికత.. వేలాది ఉద్యోగాలు

ఈ ప్రాజెక్టు ద్వారా రాడార్లకు చిక్కని 'స్టెల్త్' టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం అత్యాధునిక ఏవియానిక్స్ కలిగిన యుద్ధ విమానాలను పుట్టపర్తిలోనే తయారు చేయడంతో పాటు టెస్టింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. దీనికి అనుబంధంగా రాబోయే రోజుల్లో మరో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం అదనంగా 400 ఎకరాలను సిద్ధం చేశారు.

డ్రోన్ హబ్‌గా కర్నూలు.. విస్తరిస్తున్న పెట్టుబడులు

ఏఎంసీఏ తో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో మరో 12 మెగా ప్రాజెక్టులకు కూడా నేడు శంకుస్థాపన జరగనుంది. వీటిలో 4 రక్షణ రంగ సంస్థలు, 8 డ్రోన్ తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు రూ.4,145 కోట్ల పెట్టుబడులతో 6,071 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా కర్నూలులో ఏర్పాటు చేస్తున్న ‘డ్రోన్ సిటీ’ దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్‌గా ఎదగనుంది. మడకశిర, దొనకొండ, నెల్లూరు ప్రాంతాల్లోనూ రక్షణ సంబంధిత యూనిట్లు కొలువుదీరనున్నాయి.

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వ కసరత్తు

పారిశ్రామిక వేగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ (రూ.1430 కోట్లు), భారత్ డైనమిక్స్ (రూ.489 కోట్లు), హెచ్ఎఫ్ సీఎల్ (రూ.1040 కోట్లు), ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ (రూ.500 కోట్లు) వంటి సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటితో పాటు అదనంగా మరో రూ.5,000 కోట్ల పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. ఈ భారీ ప్రాజెక్టుల రాకతో రాయలసీమ యువతకు స్థానికంగానే ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.