

రామగుండం యూరియా మొత్తం తెలంగాణకే..
రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న వానాకాలం (ఖరీఫ్) సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎరువుల కర్మాగారం నుంచి వచ్చే పూర్తి ఉత్పత్తిని స్థానిక రైతాంగ అవసరాల కోసమే వినియోగించేలా కేంద్రానికి అధికారికంగా లేఖ రాయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు వానాకాలం పంటల సన్నద్ధత, విపత్తు నిర్వహణపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.
ఎల్ నినో ముప్పు - ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న 'ఎల్ నినో' వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సీఎంకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వర్షాభావ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని, పంటల మార్పిడిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. రైతులు సాంప్రదాయక పద్ధతుల్లో కాకుండా వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు వేసుకునేలా వ్యవసాయ విస్తరణ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి మార్గదర్శకత్వం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ పనులు
రాబోయే వర్షాకాలాన్ని తట్టుకునేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాల గేట్ల నిర్వహణ, ఇతర మౌలిక వసతుల మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు భారీగా కురిసినా లేదా అకస్మాత్తుగా వరదలు వచ్చినా ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా నీటిపారుదల శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టు వద్ద కూడా నిర్లక్ష్యానికి తావుండకూడదని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వీలైనంత త్వరగా ముగించాలని గడువు విధించారు.
రూ. 1,000 కోట్ల విపత్తు నిధుల వినియోగం:
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, సహాయక శాఖ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 1,000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం, అత్యంత పారదర్శకంగా వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులను వాడుకోవాలని, ఎక్కడా నిధుల కొరత రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పుల వల్ల సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రాణ, ఆస్తి నష్టాల నివారణే లక్ష్యం
సమీక్షా సమావేశం ముగింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. విపత్తులు సంభవించినప్పుడు అధికారులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా స్పందించాలని, పిలుపునిచ్చారు. ముందస్తు ప్రణాళికల ద్వారా మానవ ప్రాణనష్టం, పశునష్టం ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్య మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
