Let's talk: editor@tmv.in
రాజ్యసభకు అమెరికా సెనేట్ తరహా అధికారాలు ఉండాలి: కవిత

రాజ్యసభకు అమెరికా సెనేట్ తరహా అధికారాలు ఉండాలి: కవిత

Gaddamidi Naveen
3 మే, 2026

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), సమాఖ్య వ్యవస్థ బలోపేతంపై 'తెలంగాణ రక్షణ సేనస (టీఆర్ఎస్) వ్యవస్థాపకురాలు కె. కవిత సంచలన ప్రతిపాదనలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆమె పాల్గొని, దేశ రాజకీయ వ్యవస్థలో రావాల్సిన మార్పులపై తన గళాన్ని వినిపించారు.

దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, కొన్ని రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోయినా అది పెద్ద సమస్య కాదని ఆమె వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్‌లో జనాభాను స్థిరమైన ప్రమాణంగా తీసుకుని లోక్‌సభ సీట్లను నిర్ణయించాలని కవిత సూచించారు. జనాభా మార్పుల ఆధారంగా కొన్ని రాష్ట్రాలకు సీట్లు పెరగడం, కొన్ని రాష్ట్రాలకు తగ్గడం సహజమేనని ఆమె అన్నారు. అయితే, రాష్ట్రాల మధ్య సమతుల్యతను కాపాడేందుకు రాజ్యసభ పాత్రను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించాలని ఆమె ప్రతిపాదించారు.

రాజ్యసభను అమెరికా సెనేట్ తరహాలో శక్తివంతం చేయాలని కవిత అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రానికి జనాభాతో సంబంధం లేకుండా సమాన సంఖ్యలో రాజ్యసభ సీట్లు ఇవ్వాలని ఆమె సూచించారు. అలాగే, రాజ్యసభకు మరింత అధికారం ఇవ్వాలని, ముఖ్యంగా ఆర్థిక బిల్లులు సహా అన్ని ముఖ్య బిల్లులు రాజ్యసభలో కూడా తప్పనిసరిగా పరిశీలించబడాలని ఆమె అన్నారు. రాజ్యసభ అంగీకరించకపోతే బిల్లులు నిలిచిపోవాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రాల హక్కులు, రాజకీయ, ఆర్థిక భద్రత బలపడతాయని కవిత పేర్కొన్నారు. ఈ మార్పులు దేశ సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేస్తాయని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రతి రాష్ట్రానికి సమాన ప్రతినిధిత్వం ఇవ్వడం ద్వారా కేంద్రం–రాష్ట్రాల మధ్య సమతుల్యత సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. ఈ ప్రతిపాదనలపై వివరణాత్మక నివేదికను ప్రధానమంత్రి, డీలిమిటేషన్ కమిషన్‌కు పంపిస్తానని కూడా ఆమె వెల్లడించారు.

రాజకీయ నేత కేసీఆర్ పైనే నా విమర్శలు

రాజకీయ విమర్శలపై స్పందిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, అవి పూర్తిగా రాజకీయ దృష్టితో చేసినవేనని కవిత స్పష్టం చేశారు. ఆయన చేసిన రాజకీయ తప్పిదాల పైన మాత్రమే. కృష్ణా, గోదావరి నీళ్లను సరిగా వాడుకోకపోవడం వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం వల్ల రైతులకు అన్యాయం జరిగింది. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 10 సార్లు పేపర్ లీక్ అవ్వడం వల్ల రెండు తరాల యువత నష్టపోయింది. ఇలాంటి రాజకీయ వైఫల్యాలను నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, బీజేపీ అన్నీ అవినీతిలో కూరుకుపోయాయని ఆమె ఆరోపించారు.

తొలుత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని ప్రకటించినా, కుట్రలను ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చామన్నారు. టీఆర్ఎస్ అనే పేరు దైవ సంకల్పం అని ఆమె అభివర్ణించారు. పురుషుల కన్నా గొప్పగా పార్టీని నడుపుతామని, మహిళా బిల్లుతో సంబంధం లేకుండా 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెయ్యి రోజుల్లో గద్దె దించుతామని, తాము అధికారంలోకి వచ్చాక ‘తల్లి మాదిరి పాలన’ అందిస్తామని కవిత భరోసా ఇచ్చారు. తన వెనుక ఎవరూ లేరని, నిప్పుల మీద నడిచి వచ్చిన తనకు ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి ఉందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణకు ఎవరైతే విలనో, వారే తనకు కూడా విలన్ అని ప్రకటిస్తూ.. ‘సర్వోదయ తెలంగాణ’ సాధనే తన అంతిమ లక్ష్యమని కవిత ప్రకటించారు. మాజీ మావోయిస్టులను కూడా తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

పాంచజన్యం - అమలు చేయకుంటే శిక్షించండి

అదే సందర్భంలో,తమ పార్టీ 95 శాతం తెలంగాణ సమస్యలపైనే దృష్టి సారిస్తుందని చెబుతూ, 'పంచజన్య' పేరుతో ఐదు ప్రధాన వాగ్దానాలను ప్రకటించారు. ఇందులో ఉచిత విద్య, ఉచిత వైద్యం అత్యంత కీలకమైనవని ఆమె పేర్కొన్నారు. ఐదు అంశాలను అమలు చేయకుంటే తనను గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి కట్టేసి కొట్టాలని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజలు తమ ఆదాయంలో 60 శాతం విద్య, వైద్యానికే ఖర్చు చేస్తున్నారు. సంకల్పం ఉంటే ఉచితంగా ఇవి అందించడం సాధ్యమే. నిపుణులతో చర్చించాకే లక్ష కోట్ల రూపాయల కేటాయింపులతో దీనిని అమలు చేయవచ్చని హామీ ఇస్తున్నాను అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడటమే తన పార్టీ ప్రధాన లక్ష్యమని కవిత పునరుద్ఘాటించారు. మొత్తానికి, రాజ్యసభకు అమెరికా సెనేట్ తరహా అధికారాలు ఇవ్వాలన్న కవిత ప్రతిపాదన దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.