Let's talk: editor@tmv.in
ఈ‍-సిగరెట్ వివాదంలో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్

ఈ‍-సిగరెట్ వివాదంలో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్

Shaik Mohammad Shaffee
30 ఏప్రిల్, 2026

రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో పరాగ్ 'వేపింగ్' (ఈ-సిగరెట్ తాగడం) చేస్తూ కెమెరా కంటికి చిక్కడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిషేధిత జాబితాలో ఈ-సిగరెట్లు

భారత ప్రభుత్వం 2019లోనే ఈ-సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలు, పంపిణీపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. ఈ చట్టం ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. నిబంధనలు ఇంత కఠినంగా ఉన్నా, ఒక బాధ్యతాయుతమైన క్రికెటర్ కావాలని తెలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటంపై బీసీసీఐ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అజాగ్రత్తే కొంపముంచిందా?

సాధారణంగా చాలామంది ఆటగాళ్లు ఈ-సిగరెట్లు వాడుతుంటారని, కానీ కెమెరాలు ఉండే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇలా బహిరంగంగా చేయడం కేవలం అజాగ్రత్తేనని ఐపీఎల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పరాగ్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, మైదానం వెలుపల ఆయన చేసిన ఈ పని జట్టుకు తలనొప్పిగా మారింది. ఈ ఘటనపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు.

గోప్యతపై చర్చ.. కెప్టెన్ల అభ్యంతరం

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లోని ఆటగాళ్ల గోప్యత గురించి చర్చ జరిగినట్లు సమాచారం. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు లేదా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కెమెరాలు అటువైపు మళ్లించడం సరికాదని కొందరు కెప్టెన్లు అభ్యంతరం తెలిపారు. అయితే ఇది బ్రాడ్‌కాస్టర్ల పరిధిలోని అంశమని బీసీసీఐ అప్పట్లో సర్దిచెప్పింది. తాజాగా పరాగ్ ఉదంతంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

ఆరోగ్యానికి పెను ముప్పు

సాధారణ సిగరెట్ల కంటే వేపింగ్ (ఈ-సిగరెట్) అంత ప్రమాదం కాదని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదని.. దీనివల్ల శరీరానికి ఎంతో కీడు జరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రఖ్యాత జాన్ హాప్కిన్స్ వైద్య సంస్థ నివేదిక ప్రకారం, ఈ-సిగరెట్లలో ఉండే నికోటిన్ మనిషిని చాలా త్వరగా బానిసగా మార్చేస్తుంది. ఇది రక్తపోటును పెంచి, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. సమాజంలో ఎంతోమందికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక స్టార్ క్రికెటర్ ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, పరాగ్ చేసిన ఈ పని యువతపై తప్పుడు ప్రభావం చూపుతుందని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు.