Let's talk: editor@tmv.in
తెలంగాణలో ప‌లు జిల్లాల్లో వర్షం.. తడిసిన ధాన్యం

తెలంగాణలో ప‌లు జిల్లాల్లో వర్షం.. తడిసిన ధాన్యం

Gaddamidi Naveen
4 మే, 2026

గత వారం రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వరుణుడు ఊరటనిచ్చినా, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. నల్లగొండ, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, ములుగు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ప్రకృతి బీభత్సం సృష్టించింది.

మంచిర్యాల:

మందమర్రిలో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వాన విరుచుకుపడింది. ఈదురు గాలుల ధాటికి చెట్లు నేలకూలి రాకపోకలు నిలిచిపోగా, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు గ్రామాలు చీకటిలో మగ్గిపోయాయి. మందమర్రి రైల్వే స్టేషన్‌లో వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నల్లగొండ:

ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ, ఈదురుగాలుల వల్ల ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. కోతకొచ్చిన మామిడి పండ్లు నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

సిద్దిపేట & వరంగల్:

హుస్నాబాద్‌లో వడగండ్ల వర్షం కురవగా, ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భారీ వర్షం పడింది.

ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయ్యింది. అష్టకష్టాలు పడి పండించిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పండు దశలో ఉన్న మామిడి తోటల యజమానులు కూడా ఈ వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయారు.