Let's talk: editor@tmv.in
బద్రీనాథ్‌లో వర్షం.. భక్తులకు ఉపశమనం

బద్రీనాథ్‌లో వర్షం.. భక్తులకు ఉపశమనం

Pinjari Chand
26 ఏప్రిల్, 2026

ఉత్తరాఖండ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుదినాలుగా కొనసాగుతున్న తీవ్రమైన ఎండలకు ఉపశమనం లభించింది. బద్రీనాథ్ ధామ్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురవగా, ఎత్తైన పర్వత శిఖరాల్లో తేలికపాటి మంచు పడింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గి, చల్లని వాతావరణం నెలకొంది. భక్తులు ‘బద్రీ విశాల్’ దర్శనానికి చేరుకున్న సమయంలో ఈ మార్పు చోటుచేసుకోవడంతో, వారు దీనిని ‘దివ్య అనుభూతి’గా అభివర్ణించారు. హిమాలయాల్లోని ఈ అందమైన ప్రకృతి దృశ్యాలు యాత్రికులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 23న ఉదయం వేద మంత్రోచ్ఛారణల మధ్య బద్రీనాథ్ ఆలయ ద్వారాలు భక్తులకు తెరిచారు. పుష్కర్ సింగ్ ధామి యాత్ర ప్రారంభాన్ని స్వాగతిస్తూ, భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కేదార్‌నాథ్ హెలికాప్టర్ సేవలకు భారీ స్పందన

కేదార్‌నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్ షటిల్ సేవలకు అపూర్వమైన స్పందన లభించింది. ఏప్రిల్ 22 నుంచి జూన్ 15 వరకు అందుబాటులో ఉన్న మొత్తం 31,450 సీట్లు కేవలం 90 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి. బుకింగ్ ప్రక్రియ ఏప్రిల్ 15 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై, 7:28కి పూర్తయింది మొత్తం 10,855 టికెట్లు అధికారిక పోర్టల్ ద్వారా జారీ అయ్యాయి. మహారాష్ట్ర (1,708) బుకింగ్స్‌లో ముందంజలో ఉంది. యూపీ, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా బుకింగ్స్ వచ్చాయి. ఈ హెలికాప్టర్ సేవలు గుప్తకాశి, ఫాటా, సిర్సి నుంచి కేదార్‌నాథ్‌కు యాత్రికులను చేరవేస్తాయి, దీంతో కష్టమైన 16 కి.మీ నడకను తగ్గిస్తుంది. ప్రభుత్వం పారదర్శకత కోసం ఒక్క యూజర్‌కు పరిమిత బుకింగ్స్ విధించడం, కాల్ సెంటర్ ద్వారా ధృవీకరణలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకుంది.