
నోయిడా కార్మికుల ఆందోళనకు రాహుల్‌గాంధీ మద్దతు
నోయిడాలో కనీస వేతనాల పెంపు కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారు. సోమవారం కార్మికుల నిరసన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నోయిడా వీధుల్లో జరిగిన ఘటన దేశ కార్మికుల ఆవేదనకు ప్రతీక అని పేర్కొన్నారు. కార్మికుల గొంతు ఎన్నోసార్లు వినిపించినప్పటికీ పట్టించుకోలేదని, చివరికి వారు వీధుల్లోకి రావాల్సి వచ్చిందన్నారు.
తక్కువ జీతం – పెరుగుతున్న ఖర్చులు
నోయిడాలో ఒక కార్మికుడు నెలకు సుమారు రూ.12,000 మాత్రమే సంపాదిస్తాడని, కానీ ఇంటి అద్దె రూ.4,000 నుంచి రూ.7,000 వరకు ఉంటుందని ఆయన చెప్పారు. సంవత్సరానికి రూ.300 జీతం పెరిగేలోపు అద్దె రూ.500 పెరిగిపోతుందని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణం, స్థిరంగా ఉండే వేతనాలు కార్మికుల జీవనాన్ని కష్టాల్లోకి నెట్టుతున్నాయని ఆయన విమర్శించారు. గ్యాస్ ధరల పెరుగుదలపై ఒక మహిళా కార్మికురాలు వ్యక్తం చేసిన ఆవేదనను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి, కానీ మా జీతాలు మాత్రం పెరగడం లేదని ఆ మహిళా కార్మికురాలు చెప్పిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ సంక్షోభ పరిస్థితుల్లో ఇంట్లో వంట చేయడానికి ఒక సిలిండర్ కొనుగోలు చేయడానికి సుమారు రూ.5,000 వరకు ఖర్చు అవుతోందని కూడా ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు, స్థిరంగా ఉన్న వేతనాల కారణంగా కార్మికులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితి కార్మిక వర్గం జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావం
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఈ భారం కార్మికులపై పడుతుండగా పెద్ద పరిశ్రమలపై మాత్రం ప్రభావం తక్కువగా ఉందని విమర్శించారు. నవంబర్ 2025లో కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్లను అమలు చేయడం వల్ల పని గంటలు రోజుకు 12 గంటలకు పెరిగాయని ఆయన ఆరోపించారు. రోజుకు 12 గంటలు పనిచేసే కార్మికుడు పిల్లల చదువుల కోసం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
రూ.20,000 వేతనం డిమాండ్
నోయిడా కార్మికులు నెలకు రూ.20,000 వేతనం కోరుతున్నారని, ఇది అత్యాశ కాదు, వారి జీవనానికి అవసరమైన హక్కు అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ దేశానికి వెన్నెముక అయిన ప్రతి కార్మికుడి వెంట నేను నిలబడతానని ఆయన పేర్కొన్నారు. సోమవారం నోయిడాలో కార్మికుల నిరసన హింసాత్మకంగా మారడంతో రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
