Let's talk: editor@tmv.in
మాదాపూర్‌లో అర్ధరాత్రి రేసర్ల బీభత్సం.. పలువురు అరెస్ట్

మాదాపూర్‌లో అర్ధరాత్రి రేసర్ల బీభత్సం.. పలువురు అరెస్ట్

Gaddamidi Naveen
25 మే, 2026

ఐటీ హబ్ పరిధిలోని మాదాపూర్ నిలోఫర్ కేఫే సమీపంలో వీకెండ్ అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. కొందరు యువకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ నగర రహదారులను రేసింగ్ ట్రాక్‌లుగా మార్చేశారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ యువకులు గుంపులుగా చేరి అర్ధరాత్రి పూట కార్లు, బైకులతో ప్రమాదకరమైన స్టంట్లు, రేసింగ్‌లకు పాల్పడ్డారు.

పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు రేసర్లను ఆపడానికి ప్రయత్నించగా, వారు వాహనాలను ఆపకుండా మరింత దూకుడుగా పోలీసుల పైకే దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రేసింగ్ వాహనాలను వెంబడించి చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పారిపోవడానికి ప్రయత్నించిన కొన్ని కార్లను అడ్డుకుని, యువకులు లోపలి నుంచి డోర్లు లాక్ చేసుకోవడంతో, పోలీసులు కార్ల అద్దాలను పగలగొట్టి మరీ యువకులను బయటకు లాగారు. ఈ క్రమంలో రేసర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ ఉపయోగించాల్సి వచ్చింది.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, రోడ్లపై వెళ్లే సాధారణ ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసిన పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వాహనాలను సీజ్ చేశారు. నగరంలో వీకెండ్ అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న ఈ బైక్ స్టంట్లు, కార్ రేసింగ్‌లు స్థానిక ప్రజలకు, పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాంటి మితిమీరిన వేగంతో కూడిన విన్యాసాల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని, రేసర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.