
ఆర్థిక సంస్కరణలతో దేశ గమనాన్ని మార్చిన మహానేత పీవీ: సీఎం చంద్రబాబు
మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు, 'భారత రత్న' పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతికి పీవీ చేసిన విశేష కృషిని, ఆయనకున్న అద్భుతమైన దూరదృష్టిని వారు స్మరించుకున్నారు.
ఆర్థిక సంస్కరణలతో దేశ గమనాన్ని మార్చారు: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. తన అసాధారణ దూరదృష్టితో పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ అభివృద్ధి పథాన్ని పూర్తిగా మార్చివేశాయని, ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఎప్పటికీ స్మరణీయులు. దేశ ప్రగతికి ఆయన అందించిన అమూల్యమైన సేవలు, మార్గదర్శకత్వం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. ఆ మహానేతకు వినమ్ర నివాళులు అర్పించారు.
తెలుగు గడ్డ గర్వించదగ్గ మేధావి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పీవీ నరసింహారావుకి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశం కన్న గొప్ప దార్శనికులలో పీవీ ఒకరని, ఆయనో అద్భుతమైన పండితుడని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా పీవీ వహించిన నాయకత్వం దేశ చరిత్ర గమనాన్నే మార్చివేసిందన్నారు.
పవన్ కళ్యాణ్ తన సందేశంలో.. పీవీ ధైర్యం, ముందస్తు ఆలోచన, చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలు భారతదేశ వృద్ధికి సరికొత్త పంథాను చూపడమే కాకుండా, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచాయి. ఆయన అపారమైన మేధస్సు, పరిపాలనా దక్షత, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. సంపన్నమైన తెలుగు సాహిత్య వారసత్వం నుంచి దేశ అత్యున్నత ప్రజాసేవ పీఠం (ప్రధాని పదవి) వరకు.. జ్ఞానానికి, వినయానికి, దార్శనిక నాయకత్వానికి పీవీ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు ప్రస్థానం
జూన్ 28, 1921 న జన్మించిన పీవీ నరసింహారావు డిసెంబర్ 23, 2004 న కన్నుమూశారు. ఆయన జూన్ 21, 1991 నుంచి మే 16, 1996 వరకు భారతదేశ ప్రధానిగా సేవలందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసి, ప్రగతి పథంలో నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
