

పూరీ జగన్నాథ్ 26 ఏళ్ల సినీ ప్రస్థానం.. విజయ్ సేతుపతి పోస్ట్ వైరల్!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వెండితెరపై తన ప్రస్థానాన్ని ప్రారంభించి విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'బద్రి' చిత్రంతో పూరీ దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి తనదైన స్టైలిష్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో తెలుగు సినిమా గమనాన్ని మార్చేశారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
పూరీ జగన్నాథ్ ప్రయాణం ఒక లెగసీ
పూరీ జగన్నాథ్ ప్రయాణం కేవలం ఒక కెరీర్ మాత్రమే కాదని, అది ధైర్యం, నమ్మకానికి నిదర్శనమని విజయ్ సేతుపతి కొనియాడారు. నటులను వారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చి, వారిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే దర్శకుల కోసం తాము ఎదురుచూస్తుంటామని, పూరీ జగన్నాథ్ ఆ పనిని చాలా సునాయాసంగా చేస్తారని ప్రశంసించారు. పూరీ ప్రయాణం అద్భుతమని, ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో 'స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్' అనే చిత్రం రూపొందుతోంది. పూరీ 26 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ్ సేతుపతి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో దిగిన కొన్ని ఫోటోలను సేతుపతి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రం తమ అందరికీ ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.
ఈ సినిమాలో తాను ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బిచ్చగాడి వేషంలో కనిపించే తన లుక్కు సంబంధించిన ఫోటోలను పంచుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో సీనియర్ నటి టబు, మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ కాస్టింగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ పాత్ర పూరీ సినిమాల్లో ఉండే ఒక విభిన్నమైన మాస్ ఎలిమెంట్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో అభిమానులు #26YearsOfPuriJagannadh హ్యాష్‌ట్యాగ్‌తో శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. పూరీ మార్క్ హీరోయిజం, స్టైలిష్ టేకింగ్‌ను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
హీరోల క్యారెక్టరైజేషన్‌ను సరికొత్తగా ఆవిష్కరించడంలో ఆయన శైలే వేరు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలన్నా, ప దునైన డైలాగ్స్ రాయాలన్నా పూరీ తర్వాతే ఎవరైనా అని సినీ వర్గాలు కొనియాడుతుంటాయి. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన పూరీ, వారి కెరీర్లోనే మైలురాళ్ల వంటి చిత్రాలను అందించారు. పూరీ సినిమాల్లో హీరో ప్రవర్తన, మాట తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. అందుకే ప్రతి హీరో ఆయనతో ఒక్కసారైనా పనిచేయాలని ఆశిస్తుంటారు. రెండున్నర దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న పూరీ జగన్నాథ్ కి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిరంతరం కొత్తదనంతో స్పూర్తినిచ్చే ఆయన ప్రయాణానికి ఎప్పటికీ గౌరవం ఉంటుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ నిలిచిన 'బద్రి' సినిమా నేటితో విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2000వ సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం, పవన్ కల్యాణ్ కెరీర్లో ఒక భారీ మైలురాయిగా నిలవడమే కాకుండా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. పవన్ కల్యాణ్ ఎనర్జీకి, పూరీ జగన్నాథ్ మార్క్ డైలాగ్స్ తోడవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇందులో అమీషా పటేల్, రేణు దేశాయ్ కథానాయికలుగా నటించారు. నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్.. ఐతే ఏంటి" అనే డైలాగ్ అప్పట్లో యువతలో ఒక ఊపు ఊపింది. నేటికీ ఈ డైలాగ్ పూరీ మార్క్ హీరోయిజానికి నిదర్శనంగా నిలుస్తుంది.
