
మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రబీ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ధాన్యం రాక పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ‘మిషన్ మోడ్’లో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే 5,000కు పైగా కేంద్రాలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మరో 3,500 కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 4.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు పూర్తయిందని అధికారులు వివరించారు. ధాన్యం నిల్వ కోసం 12 ఎల్‌ఎమ్‌టిల మధ్యంతర నిల్వ స్థలాన్ని గుర్తించడమే కాకుండా, 20 ఎల్‌ఎమ్‌టిల బాయిల్డ్ రైస్ ధాన్యం కేటాయింపులు కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలు, రవాణా
ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా ఉండేందుకు 16 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి తెలిపారు. తేమ శాతం సమస్యలను అధిగమించడానికి కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణ కొనుగోలు కేంద్రాలకు రాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాలు, మార్కెటింగ్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, రైతులకు చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదని తెలిపారు. సుమారు 20 జిల్లాల్లో ధాన్యం రాక మొదలైందని, నాట్లు ఆలస్యమైన మిగిలిన 13 జిల్లాల్లోనూ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
