
నేడు తెలంగాణలో ‘పల్స్ పోలియో’
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్న ‘పల్స్ పోలియో’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బృహత్తర కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చూడాలని, ఒక్కరు కూడా మిగిలిపోవద్దని మంత్రి ఆదేశించారు.
అధికారులు వివరించిన వివరాల ప్రకారం.. జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేస్తారు. జూన్ 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు చుక్కలు వేస్తారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున, అక్కడ జూలై 1న అదనంగా మరో రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 40.97 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనుండగా, ఇందుకోసం 52.04 లక్షల బీవోపీవీ టీకా డోసులు జిల్లాలకు సరఫరా చేశారు. కార్యక్రమంలో 8,393 ఏఎన్‌ఎంలు, 27,181 ఆశా కార్యకర్తలు, 34,442 అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన తండాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమం, ఆర్టీసీ వంటి శాఖల సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణలో చివరి పోలియో కేసు 2007 లో నమోదైందని, అప్పటి నుంచి రాష్ట్రం పోలియో రహితంగా కొనసాగుతోందని అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ఈ విడతలో మరోసారి వేయించడం వల్లే చిన్నారులకు పూర్తి రక్షణ లభిస్తుంది. తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలను సమీపంలోని బూత్‌లకు తీసుకువచ్చి రెండు చుక్కల పోలియో టీకా వేయించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
