
ప్రజా సంక్షేమమే మా ధ్యేయం: మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీతో పాటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
విధుల నిర్వహణలో సౌలభ్యం కోసం అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అందిస్తున్న సెల్ ఫోన్లను వివేక్ వెంకటస్వామి అందజేశారు. అనంతరం 37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించేందుకు జర్మనీ సంస్థ 'టామ్ కామ్' తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. జర్మనీలో ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న యువకులు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మేడిగడ్డను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేసిందని మండిపడ్డారు. అభివృద్ధి చేయలేకపోయినందుకే ప్రజలు వారిని తిరస్కరించారని, సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసే వారిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రస్తుత ప్రజా పాలనలో ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అర్హులకు అందుతున్నాయని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
