
ప్రజా సమస్యలు గాలికొదిలేశారు:బొత్స సత్యనారాయణ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా మంత్రులు విదేశీ పర్యటనల్లో మునిగి తేలుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యలు రోజురోజుకూ జటిలమవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని మండిపడ్డారు.
గోవాడ రైతుల బకాయిలు చెల్లించాలి
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సుమారు రూ.36 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటంపై బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని కాపాడుతామని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ మాటను తుంగలో తొక్కారని విమర్శించారు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకున్న తీరును గుర్తు చేస్తూ తక్షణమే బకాయిలపై స్పష్టమైన గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు.
ప్రాజెక్టులపై క్రెడిట్ పాలిటిక్స్
అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే అనేక ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని ఇప్పుడు వాటికి శంకుస్థాపనలు చేస్తూ కూటమి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని బొత్స ఎద్దేవా చేశారు. నేను చెప్పే విషయాల్లో ఒక్కటైనా అబద్ధం ఉంటే ఇన్‌ఛార్జ్ మంత్రి సమాధానం చెప్పాలి నా మాటలు అసత్యమని నిరూపిస్తే తలదించుకుంటాను అని ఆయన సవాల్ విసిరారు. ఇక మావిగన్ పేరు వింటేనే కూటమి నేతలు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు.
నిరంకుశ పోకడలు వద్దు
ప్రజా సమస్యలపై నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని అమరణ దీక్షలకు జైలు శిక్షలు విధిస్తామనడం గర్హనీయమని బొత్స అన్నారు. దీక్షలు చేయకపోతే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో పనులు లేక పేదలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు గీతం సంస్థలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భవిష్యత్తులో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది కాలంగా రూ.3.70 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని ఆరోపిస్తూ, ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. పత్రికల అండతో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
