Let's talk: editor@tmv.in
ప్రజారోగ్యం, మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత: మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రజారోగ్యం, మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రజారోగ్యం, మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Gaddamidi Naveen
7 మే, 2026

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా, వైద్యం, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ అమలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని బాలసదనంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య శాఖను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే 18 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టామన్నారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నట్లు తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు టేక్ హోమ్ రేషన్ అందిస్తున్నామని చెప్పారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పోషకాహారం, ఆరోగ్య సేవలు, రోగ నిరోధకత, రిఫరల్ సేవలు, ఆరోగ్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. అనంతరం బాలసదనంలో ఉన్న బాలికలతో మంత్రి ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్, సబ్ కలెక్టర్ ఉమా హారతి, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.