
ఏపీలో ఆస్తి పన్ను కాసుల వర్షం..ఏప్రిల్‌లో రూ.1,010 కోట్లకు పైగా వసూళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు ఆస్తి పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఏప్రిల్ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. 1,010.7 కోట్లకు పైగా పన్ను వసూలు కావడం విశేషం. గత ఏడాది ఇదే ఏప్రిల్ నెలలో వసూలైన రూ. 814.1 కోట్లతో పోలిస్తే ఇది 24.1 శాతం వృద్ధిని సూచిస్తోంది. ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలు పన్ను చెల్లింపుదారులకు కల్పించిన వెసులుబాట్లు ఈ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఈ గణాంకాలను వివరిస్తూ పాలనలో సాంకేతికతను జోడించడం వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. జీఐఎస్ ఆధారిత ప్రాపర్టీ మ్యాపింగ్, డ్రోన్ సర్వేల ద్వారా పన్ను పరిధిలోకి రాని ఆస్తులను గుర్తించడం, డిజిటల్ డ్యాష్‌బోర్డుల ద్వారా పర్యవేక్షణ వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేశాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది సుమారు 96,000 కొత్త ఆస్తులను గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఆటో-మ్యూటేషన్ ప్రక్రియ ద్వారా అందిన 13,900 దరఖాస్తుల్లో ఇప్పటికే 12,000 పరిష్కరించి పౌర సేవల్లో పారదర్శకతను పెంచారు.
మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా చూస్తే కాకినాడ నగరం రూ. 29.5 కోట్ల వసూళ్లతో సామర్థ్యం పరంగా అగ్రస్థానంలో నిలిచింది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి-తాడేపల్లితో పాటు గుంటూరు, రాజమండ్రి, కర్నూలు నగరాలు 39 శాతానికి పైగా వసూళ్లతో మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. కాగా విశాఖపట్నం అత్యధికంగా రూ. 230.1 కోట్లు వసూలు చేయగా, విజయవాడ రూ.85.9 కోట్లను సమీకరించింది. చిన్న పట్టణాల విభాగంలో అద్దంకి 51.5 శాతం వసూళ్లతో రికార్డు సృష్టించగా ఆత్మకూరు, వినుకొండ, పొన్నూరు, చీరాల వంటి ప్రాంతాలు కూడా నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడంలో ముందంజలో ఉన్నాయి.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ.. పన్ను వసూళ్లు పెరగడం వల్ల స్థానిక సంస్థలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, ఇది నగరాల మౌలిక వసతుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో మరింత పారదర్శకత కోసం బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని ప్రభుత్వ విభాగాల వద్ద పెండింగ్‌లో ఉన్న బకాయిలను మరో మూడు నెలల్లో వసూలు చేసేలా కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
