Let's talk: editor@tmv.in
ఏఐ విప్లవంలోనూ వృత్తి నైపుణ్యాలదే పైచేయి: వెంకయ్యనాయుడు

ఏఐ విప్లవంలోనూ వృత్తి నైపుణ్యాలదే పైచేయి: వెంకయ్యనాయుడు

Gaddamidi Naveen
27 జూన్, 2026

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం వస్తున్నప్పటికీ ఏసీ టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు వంటి క్షేత్రస్థాయి వృత్తి నిపుణులకు డిమాండ్ తగ్గకపోగా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడ సమీపంలోని ఆత్కూర్ ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న శిక్షణార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉన్నత చదువులు చదివే అవకాశం లేని వారు నిరాశ చెందకుండా.. ఇలాంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా స్వయం సమృద్ధి సాధించి, జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. యువతకు ఉచిత వసతి, ఉచిత భోజనంతో పాటు ఉచితంగా ఈ శిక్షణను అందిస్తున్నందుకు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ ని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. 1975లో దేశంలో విధించిన ‘అత్యవసర పరిస్థితి’ నాటి దారుణ పరిస్థితులను, ఆనాడు ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అయిందో యువతరానికి వెంకయ్యనాయుడు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని, ఎవరి కర్తవ్యాన్ని వారు సమర్థంగా నిర్వహించడమే నిజమైన ‘దేశభక్తి’ అని ఉద్ఘాటించారు.

స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం వాంఛనీయం కాదు. నేటి సమాజంలో కొందరు యువకులు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ గంజాయి, మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వంటి చెడు వ్యసనాలకు బానిసలు కావడం అత్యంత విచారకరం అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. యువతరం చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, బాధ్యతాయుతంగా మెలుగుతూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటూ ప్రతి ఒక్కరూ ‘వికసిత భారత్’ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
VenkaiahNaiduSkillDevelopmentYouthEmpowermentSwarnaBharatTrustAIVocationalTrainingDemocracyEmergency1975ViksitBharatIndiaAndhraPradesh
ఏఐ విప్లవంలోనూ వృత్తి నైపుణ్యాలదే పైచేయి: వెంకయ్యనాయుడు - Tholi Paluku