Let's talk: editor@tmv.in
చితక్కొట్టిన ప్రియాన్ష్, కూపర్.. లక్నోపై పంజాబ్ ఘన విజయం
చితక్కొట్టిన ప్రియాన్ష్, కూపర్.. లక్నోపై పంజాబ్ ఘన విజయం

చితక్కొట్టిన ప్రియాన్ష్, కూపర్.. లక్నోపై పంజాబ్ ఘన విజయం

Shaik Mohammad Shaffee
20 ఏప్రిల్, 2026

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్య (93; 37 బంతుల్లో, 9 సిక్సర్లు, 4 ఫోర్లు), ఆస్ట్రేలియా యువ కిరణం కూపర్ కనోలీ (87; 45 బంతుల్లో, 7 సిక్సర్లు, 8 ఫోర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో లక్నో సూపర్ జెయింట్స్ కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించగా.. లక్ష్యచేధనలో లక్నో 200 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.

ఆకాశమే హద్దుగా.. సిక్సర్ల వర్షం!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్ తొలి బంతికే షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. ఢిల్లీ కుర్రాడు ప్రియాన్ష్ ఆర్య, ఆసీస్ ఆటగాడు కనోలీ కలిసి లక్నో బౌలర్లను చీల్చిచెండాడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 80 బంతుల్లోనే 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

గౌతమ్ గంభీర్ గురువు సంజయ్ భరద్వాజ్ శిష్యుడైన ప్రియాన్ష్, క్రీజులో పాతుకుపోయి చుక్కలు చూపించాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఇతడు, తర్వాతి 43 పరుగులను కేవలం 18 బంతుల్లోనే సాధించాడు. మరోవైపు కూపర్ కనోలీ కూడా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ గర్వపడేలా అద్భుతమైన పుల్ షాట్లు, కవర్ డ్రైవ్‌లతో అలరించాడు. ఇతడు 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా, ఆ తర్వాత గేర్ మార్చి 12 బంతుల్లోనే 37 పరుగులు పిండుకున్నాడు.

లక్నో తప్పిదం.. పంజాబ్‌కు వరం

లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన ఒక చిన్న తప్పు ఆ జట్టును భారీ మూల్యానికి గురిచేసింది. ఇన్నింగ్స్ మొదట్లో మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో కానల్లీ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయినా, పంత్ డీఆర్ఎస్ తీసుకోలేదు. రిప్లేలో అది క్లియర్ అవుట్ అని తేలడంతో పంజాబ్ బ్యాటర్లకు ఆక్సిజన్ అందినట్లయింది. ఎయిడెన్ మార్‌క్రమ్ వేసిన ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదడం గమనార్హం. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (2/25) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.

విజృంభించిన వైశాఖ్.. చేతులెత్తేసిన లక్నో

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు పవర్‌ప్లేలో (61/0) ఆశలు చిగురించాయి. కెప్టెన్ రిషభ్ పంత్ (43), మిచెల్ మార్ష్ (40) పోరాడినా, పంజాబ్ బౌలర్ వైశాఖ్ విజయకుమార్ తన పేస్ వైవిధ్యంతో వారిని కట్టడి చేశాడు. వైశాఖ్ వేసిన కీలక ఓవర్లలో పరుగులు రాకపోవడంతో లక్నో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. పంత్, మార్ష్ నిష్క్రమించాక లక్నో పోరాటం నామమాత్రంగానే సాగింది. పంజాబ్ బౌలర్లు సమష్టిగా రాణించి లక్నోను 200 పరుగుల వద్దే నిలువరించారు.

గతేడాది రన్నరప్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన, ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా మైదానంలో కసిగా ఆడుతోంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్రియాన్ష్ ఆర్య 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.

ఎట్టకేలకు బోణీ కొట్టిన కేకేఆర్

మరోవైపు ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) 4 వికెట్ల తేడాతో ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. జైస్వాల్ (39), వైభవ్ సూర్యవంశీ (46) రాణించడంతో ఒక దశలో 81/0తో పటిష్టంగా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి (3/14), సునీల్ నరైన్ (2/26) అద్భుత స్పిన్‌తో కట్టడి చేయడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 155/9 పరుగులకే పరిమితమైంది. కార్తీక్ త్యాగి కూడా మూడు వికెట్లతో చెలరేగి రాజస్థాన్‌ను దెబ్బతీశాడు.

అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వైస్ కెప్టెన్ రింకూ సింగ్ (53 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అనుకూల్ రాయ్ (29) తో కలిసి రింకూ 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసినప్పటికీ కేకేఆర్‌ను అడ్డుకోలేకపోయారు.