Let's talk: editor@tmv.in
మెదక్ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు దగ్ధం

మెదక్ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు దగ్ధం

Gaddamidi Naveen
28 ఏప్రిల్, 2026

తెలంగాణలోని మెదక్ జిల్లాలో నేషనల్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. మెదక్ నుంచి హైదరాబాద్‌కు మరమ్మతుల కోసం వెళ్తున్న క్రమంలో మాసాయిపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ప్రమాదం జరిగిన తీరు..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కొన్ని సాంకేతిక లోపాల కారణంగా రిపేర్ చేయించడం కోసం హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి మాత్రమే ఉన్నారు. మాసాయిపేట వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే బస్సును ఆపి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఒక ఫైర్ ఇంజిన్‌తో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు చాలా వరకు దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు అంటుకున్న వెంటనే వారు అప్రమత్తమై బయటకు వచ్చేయడం వల్ల ప్రాణాపాయం కలగలేదు అని ఫైర్ ఆఫీసర్ వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.