
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల10న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన అత్యంత విజయవంతం అయ్యేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో బ్లూ బుక్ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను సీఎస్ ఆదేశించారు.
బేగంపేట విమానాశ్రయం, హెలిప్యాడ్‌లు, సభా ప్రాంగణాల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని, అత్యవసర వైద్య సదుపాయాలను ఆరోగ్య శాఖ పర్యవేక్షించాలని సూచించారు. అలాగే పోలీసులు ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే మార్గాలను జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ అధికారులు తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటన సాగే అన్ని ప్రాంతాల్లో అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, దాన కిషోర్, వాణి ప్రసాద్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా చూడటమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎస్ పునరుద్ఘాటించారు.
