Let's talk: editor@tmv.in
నేడు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన

నేడు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన

Gaddamidi Naveen
10 మే, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయడంతో పాటు కొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. 2024లో తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇటీవలే పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో మోడీ నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభ ఇదే కావడం విశేషం.

ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, ప్రధానమంత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు చేరుకుని గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచే ఆయన వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌ను నాలుగు వరుసల రహదారిగా మార్చే పనులకు, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేస్తారు. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన వివిధ సెక్షన్లను ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ పీఓఎల్ (పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్) టెర్మినల్‌ను ప్రారంభించడంతో పాటు, వరంగల్‌లో పీఎం మిత్రా పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు.

అభివృద్ధి కార్యక్రమాల అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ సభకు సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని రాష్ట్ర బీజేపీ అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 'వాల్ రైటింగ్' ప్రచారాన్ని చేపట్టిన పార్టీ శ్రేణులు, మోడీ పర్యటనతో తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తోంది. తెలంగాణలో 'డబుల్ ఇంజిన్ సర్కార్' ఉంటేనే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి, ప్రధాని మోడీ పర్యటన ఒక మైలురాయిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.