
ప్రధాని మోడీ చారిత్రాత్మక మైలురాయి.. తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ‘ఎన్నికైన ప్రధాని’గా సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రధాని మోడీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని లొక్ భవన్ నుంచి విడుదలైన ఒక అధికారిక ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు.
ప్రధాని మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధి, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిష్టను గణనీయంగా పెంచుకుందని గవర్నర్ కొనియాడారు. అదే సమయంలో జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో దేశం ఎల్లప్పుడూ ముందుందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు 'వికసిత్ భారత్ 2047' విజన్ రాబోయే రోజుల్లో భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మోడీ సారథ్యంలో దేశం ప్రగతి, శ్రేయస్సులో మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకాన్ని గవర్నర్ వ్యక్తపరిచారు.
తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు
ఈ చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి నాయకత్వం భారతదేశాన్ని మరింత పురోగతి, సంపన్నత, ప్రపంచ నాయకత్వం వైపు నడిపించాలని గవర్నర్ ఆకాంక్షించారు.
నరేంద్ర మోడీ మే 26, 2014న భారీ విజయంతో దేశ ప్రధానిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో మరింత భారీ మెజారిటీతో రెండోసారి, ఆపై 2024లో వరుసగా మూడోసారి దేశ పగ్గాలను చేపట్టి విజయవంతంగా మునుపెన్నడూ లేని రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ కాలపు రికార్డును ప్రధాని మోడీ బద్దలు కొట్టారు. జూన్ 9 నాటికి ఆయన పదవిలో విజయవంతంగా 4,398 రోజులను పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.
