
తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ భరోసా: ఎన్. రామచందర్ రావు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 10న తెలంగాణ పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు వెల్లడించారు. శనివారం మెదక్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని, మోడీ పర్యటనతో తెలంగాణ ప్రగతి పథంలో మరో అడుగు ముందుకు వేయబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో ప్రధాని మోడీ జహీరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ సిటీ, వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకమైన పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. అదేవిధంగా హఫీజ్‌పేట్, జోగులాంబ గద్వాల్‌లోని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, పలు జాతీయ రహదారి ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్‌పోర్ట్ వంటి మరిన్ని కీలక ప్రాజెక్టులు అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారిందని రామచందర్ రావు విమర్శించారు. నెల మొదటి తేదీన జీతాలు అందకపోవడం, ఉపాధ్యాయుల వేతనాలు ఆలస్యమవడం, 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలు ఇంకా చెల్లించకపోవడం, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యమవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. హైకోర్టు జోక్యం చేసుకుని నాలుగు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, ఉద్యోగులను కార్పొరేషన్ సిబ్బందిగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కూడా ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ప్రజల్లో నిరాశ కలిగిస్తోందన్నారు.
రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ, ఇటీవల పలు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు ధాన్యం కుప్పలుగా పేరుకుపోవడం, వర్షాల కారణంగా పంట నష్టపోవడం గమనించానని ఆయన చెప్పారు. సరైన సమయంలో లారీలు, ట్రక్కులు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యమవుతోందన్నారు. కొందరు రైస్ మిల్లర్లు, మధ్యవర్తులు, అధికారులు కుమ్మక్కై రైతులకు నష్టం కలిగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు పంట అమ్ముకునే పరిస్థితి అన్యాయమని పేర్కొన్నారు. వరి రైతులతో పాటు మొక్కజొన్న రైతుల పంటలను కూడా కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసి, రైతులకు తక్షణ ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
