Let's talk: editor@tmv.in
నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

Gaddamidi Naveen
30 జూన్, 2026

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, జూలై 1 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని రెండు ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రపతి అధికారిక పర్యటన షెడ్యూల్ ప్రకారం జూన్ 30, జూలై 1 తేదీల్లో ఆమె విశాఖపట్నం, అనంతపురం నగరాల్లో పర్యటించనున్నారు.

ఇవాళ‌ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ జరగనున్న 'సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' ప్రథమ స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమె బెంగళూరుకు తిరుగుపయనమై, రాత్రికి కర్ణాటక లోక్ భవన్‌లో బస చేయనున్నారు.

బుధవారం (జూలై 1) ఉదయం బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా అనంతపురం చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నసెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రపతి తిరిగి బెంగళూరు హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమవుతారు. జూలై 1న‌ సాయంత్రం 4:25 గంటల కల్లా ఆమె రాష్ట్రపతి భవన్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ రెండు స్నాతకోత్సవాల సందర్భంగా పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేయడంతో పాటు రాష్ట్రపతి ప్రత్యేక సందేశాన్ని అందించనున్నట్లు అధికారిక షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
PresidentDroupadiMurmuDroupadiMurmuAndhraPradeshVisakhapatnamAnantapurConvocationUniversityGraduationCentralTribalUniversity
నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన - Tholi Paluku