
మండల స్థాయి నుంచే ఆర్థిక వృద్ధిని ట్రాక్ చేసేలా పటిష్టమైన వ్యవస్థను సిద్ధం చేయండి: ఏపీ సీఎం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అమరావతిలో ప్లానింగ్ విభాగంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన దార్శనికతను ప్రకటించిన సీఎం "స్వర్ణ ఆంధ్ర-2047" లక్ష్యాలను సాధించాలంటే కనీసం 15 శాతం ఆర్థిక వృద్ధి రేటును ప్రతి ఏటా కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుతమున్న పరిపాలనా వ్యవస్థను మరింత ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం పాత పద్ధతుల్లో అంచనాలకు పరిమితం కాకుండా వాస్తవ గణాంకాల ఆధారంగా ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు.
అదేవిధంగా రాష్ట్రం త్వరలో పూర్తిస్థాయిలో డేటా ఆధారిత పరిపాలన వైపు మళ్లబోతోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం అమలులో ఉన్న త్రైమాసిక, వార్షిక జీఎస్‌డీపీ అంచనాలు తక్షణ నిర్ణయాలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదని అందుకే రియల్-టైమ్ మానిటరింగ్ విధానాలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. కేవలం గతం నుంచి వస్తున్న చారిత్రక డేటాపైనే ఆధారపడటం వల్ల విధాన నిర్ణయాల్లో ఆలస్యం జరుగుతోందని ఇకపై ప్రతి జిల్లా, మండల స్థాయిలో నెలవారీ ఆర్థిక వృద్ధిని ట్రాక్ చేసేలా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
డేటా సేకరణలో ఖచ్చితత్వం వేగాన్ని పెంచేందుకు రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న సిబ్బందికి మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ అందించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు అధికారులను ఎంపిక చేసి వారికి జీఎస్‌డీపీ అంచనా పద్ధతులు వేగవంతమైన డేటా విశ్లేషణపై నైపుణ్యం కల్పించాలని ప్రతిపాదించారు.
మరోవైపు వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధిని అంచనా వేసేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత విశ్లేషణా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు పరిగణనలోకి తీసుకోని ఆర్థిక సూచికలను గుర్తించి వాటిని కూడా లెక్కల్లోకి తీసుకోవడం ద్వారా ప్రభుత్వ విధాన నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా, సమర్థవంతంగా మార్చాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్రవ్యాప్త సర్వేలు, సీపీఐ ఆడిటింగ్ వ్యవస్థల సమన్వయం వంటి పలు కీలక అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించారు.
