Let's talk: editor@tmv.in
ఉచిత విద్యుత్ రద్దు కోసమే ప్రీపెయిడ్ మీటర్లు: కేటీఆర్

ఉచిత విద్యుత్ రద్దు కోసమే ప్రీపెయిడ్ మీటర్లు: కేటీఆర్

Gaddamidi Naveen
25 మే, 2026

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని, ఇళ్లలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంబర్‌పేట నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్‌ను పూర్తిగా ఎత్తేసేందుకు, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గ్రామాల్లో, పట్టణాల్లో, వ్యవసాయానికి రానున్న మూడు నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి, మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురావాలని శ‌నివారం కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు.

నాడు కేసీఆర్ ఎదిరించారు..

కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని, మోటర్ల దగ్గర మీటర్లు వస్తాయని ఎన్నికల ముందే కేసీఆర్ హెచ్చరించారు. ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడి తెచ్చి, రూ.30 వేల కోట్ల రుణాన్ని ఆపినా కేసీఆర్ మీటర్లు పెట్టలేదు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్‌ను రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతో అదానీ, అంబానీలకు లొంగిపోయిందని కేటీఆర్ విమర్శించారు. మోటార్లకు మీటర్లు రాకముందే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసేయాలని పిలుపునిచ్చారు.

ఐదేళ్ల కాలంలో సగం పూర్తయినా (రెండున్నర సంవత్సరాలు) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేక చేతులెత్తేసిందని, అడ్డగోలు హామీలతో మోసం చేసినందుకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు. త్వరలోనే పార్టీ శ్రేణులకు డిజిటల్ సభ్యత్వ నమోదు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.

రెండున్నర సంవత్సరాల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టని రేవంత్ రెడ్డి, 'హైడ్రా' పేరుతో వేలాది పేదల ఇండ్లను కూలగొట్టారని కేటీఆర్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో లక్ష ఇండ్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వం ఉన్నవాటిని ధ్వంసం చేస్తోందన్నారు. నగరంలో కనీసం మోరి తీసి, చెత్త ఎత్తే పరిస్థితి లేని మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, 'ఫ్యూచర్ సిటీ' అంటూ పోజులు కొడుతుంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, బ్రిడ్జిల నిర్మాణం జరిగి, మూసీ ప్రక్షాళన దాదాపు పూర్తయిందన్నారు. కానీ, రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్ట్ కమిషన్ల కోసమే లక్షన్నర కోట్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎలాంటి విధ్వంసం లేకుండా మూసీ అభివృద్ధిని తలపెడితే, రేవంత్ రెడ్డి మాత్రం వేలాది మంది ఇండ్లను కూలగొట్టి ప్రజలను రోడ్డున పడేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.