Let's talk: editor@tmv.in
దేవాలయాల్లో స్థానిక వేద పండితులకే ప్రాధాన్యత ఇవ్వాలి: మాజీ మంత్రి హరీష్ రావు

దేవాలయాల్లో స్థానిక వేద పండితులకే ప్రాధాన్యత ఇవ్వాలి: మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
1 జులై, 2026

తెలంగాణలోని యాదాద్రి, బాసర, భద్రాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేద పండితుల నియామకాల్లో స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు మాజీ మంత్రులు హరీష్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో వేదాలు వల్లించే వేద పండితులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడం బాధాకరమని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలోని దేవాలయాల్లో స్థానిక వేద పండితులకు దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి వెళ్తున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

తెలంగాణ యువత, స్థానిక వేద పండితుల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన, దేవాలయాల్లో భర్తీ చేసే వేద పండితుల పోస్టుల్లో స్థానికులకు తప్పనిసరిగా ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. అలాగే, ఇంటర్వ్యూ బోర్డుల్లో కూడా తెలంగాణకు చెందిన అర్హులైన వేద పండితులకు అవకాశం కల్పించాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక స్థానికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని గుర్తుచేస్తూ, అలాంటి రాష్ట్రంలో స్థానిక వేద పండితులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదని అన్నారు.

తెలంగాణకు చెందిన అర్హులైన వేద పండితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నియామక ప్రక్రియను సమీక్షించాలని, స్థానికులకు ప్రాధాన్యం కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్థానికుల హక్కులను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు
TelanganaVedaPanditsTempleRecruitmentHarishRaoBRSLocalJobsLocalReservationTelanganaTemplesYadadriBhadrachalamBasara