
ఢిల్లీ మేయర్‌గా ప్రవేశ్ వాహి.. డిప్యూటీ మేయర్‌గా మోనికా పంత్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్‌గా బుధవారం భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్ ప్రవేశ్ వాహి ఎన్నికయ్యారు. ఆయన రోహిణి ఈస్ట్ వార్డు నెం. 53 నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అలాగే ఆనంద్ విహార్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా ఉన్న మోనికా పంత్ ఏకగ్రీవంగా ఢిల్లీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ బీజేపీకి చెందినవారే కావడం విశేషం. ఎంసీడీ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఎన్నికలతో బీజేపీ ఆధిపత్యం మరింత బలపడినట్లు భావిస్తున్నారు. వీరికంటే ముందు మేయర్‌గా ఉన్న రాజా ఇక్బాల్ సింగ్ పదవీకాలం ముగిసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరన్‌జీత్ సింగ్ సంధు ఈ ఎన్నికల కోసం ఆయనను ప్రెసైడింగ్ ఆఫీసర్‌గా నియమించారు.
ఆప్‌పై బీజేపీ విమర్శలు
ఇదిలా ఉండగా, తాజాగా బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్, మేయర్ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకపోయిన ఆమ్‌ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో పోటీకి దిగకపోవడం ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడమే. ఓడిపోతామనుకున్నా కూడా పోటీ చేయాలని ఆమె పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతుందని అన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో ఎంసీడీ కీలక పాత్ర పోషిస్తుందని, నగర పాలనలో రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రవీందర్‌సింగ్ నేగీ కూడా ఆప్‌పై విమర్శలు చేశారు. తమకు మెజారిటీ లేదని తెలిసి ఆప్ అభ్యర్థిని నిలపలేదు. ఢిల్లీలో ‘ట్రిపుల్ ఇంజిన్’ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని అన్నారు. మొత్తంగా, ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగగా, ఆప్ గైర్హాజరు రాజకీయ చర్చలకు దారి తీసింది.
