
'ప్రజావాణి' సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా మార్చాలని, 'ప్రజావాణి' సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మరియు సీఎంవో అధికారులతో కలిసి ఆయన ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం విజయవంతంగా జరుగుతున్న ప్రజావాణిని ఇకపై ప్రజల వద్దకే తీసుకెళ్లాలని సీఎం సూచించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా, వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో, ఆ తదుపరి దశలో మండల స్థాయిలో ప్రజావాణిని ప్రారంభించాలని ఆదేశించారు.
అలాగే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు అన్ని స్థాయిల్లో అధికారులకు తగిన అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి గడువులు నిర్ణయించి, ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆలస్యం చేసే అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్‌టైమ్ మానిటరింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని, జిల్లాల వారీగా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక స్థాయిలో పరిష్కారం కాని ఫిర్యాదులు పైస్థాయికి స్వయంచాలకంగా చేరేలా ఆటో ఎస్కలేషన్ విధానాన్ని అమలు చేయాలని, అవసరమైతే అప్పీల్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు.
ప్రజా ప్రభుత్వం – ప్రజల నమ్మకం
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే, 2023 డిసెంబర్ 8న ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు వేలాది అర్జీలను ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పుడు ఈ వ్యవస్థను వికేంద్రీకరించడం ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ పడకూడదని, పెండింగ్ అంశాలపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
