

రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా దర్బార్': మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ప్రజల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో, పారదర్శకమైన రీతిలో నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా దర్బార్' కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శనివారం పాలేరు నియోజకవర్గంలోని రాయిగూడెం క్లస్టర్ పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన పాల్గొన్నారు.
రాయిగూడెం, అజయ్ తండా, చెరువుమాదారం, మంగపురం తండా, బుద్ధారం సహా పలు గ్రామ పంచాయతీల ప్రజలతో మంత్రి నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి, ప్రభుత్వపై నమ్మకాన్ని పెంచడమే ప్రజా దర్బార్‌ల ప్రధాన ఉద్దేశమని అన్నారు. పాలేరు నియోజకవర్గాన్ని ఈ కార్యక్రమానికి ఒక మోడల్‌గా ఎంపిక చేశామని, త్వరలోనే దీనిని రాష్ట్రమంతటా విస్తరిస్తామని వెల్లడించారు.
తాగునీరు, విద్యుత్, ధరణికి సంబంధించిన భూ సమస్యలు ఈ వేదికల ద్వారా పరిష్కారమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల వరకే.. ఆ తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రాథమిక బాధ్యత. అర్హులైన ప్రతి ఒక్కరి ఫిర్యాదును పరిష్కరిస్తాం. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారమైతే, మరికొన్నింటికి వారం నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు అని ఆయన అన్నారు. గతంలో ప్రజలు తమ గొంతు వినిపించడానికి సరైన వేదికలు లేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు అధికారులే నేరుగా ప్రజల వద్దకు వస్తున్నారని మంత్రి తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేసి అధికారుల ద్వారా సమస్యలను పరిశీలించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలినవాటిని నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూమి సమస్యలు వంటి అంశాలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
