Let's talk: editor@tmv.in
ఆర్టీసీలో పీపీపీ విధానం అన్యాయం.. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఖండించిన వైసీపీ నేతలు

ఆర్టీసీలో పీపీపీ విధానం అన్యాయం.. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఖండించిన వైసీపీ నేతలు

Gaddamidi Naveen
23 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీలో పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడాన్ని, సంస్థను క్రమంగా ప్రైవేటుపరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

ఆర్టీసీ అనేది కేవలం లాభనష్టాలతో నడిచే సాధారణ వ్యాపార సంస్థ కాదని, అది గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన ప్రజా సేవా వ్యవస్థ అని వారు స్పష్టం చేశారు. లాభాలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉన్న ఆర్టీసీని లాభార్జనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టడం ప్రజా ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమని మండిపడ్డారు.

ప్రైవేట్ సంస్థల ప్రధాన ఉద్దేశ్యం లాభార్జనే కావడంతో, పీపీపీ విధానం అమలైతే టికెట్ ధరలు పెరగడం, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులు తగ్గిపోవడం వంటి ప్రమాదాలు ఉండవచ్చని వారు హెచ్చరించారు. అలాగే వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు భరోసా కల్పించడంతో పాటు జీతాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వారు గుర్తు చేశారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని అనుసరిస్తోందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరపాడు హుస్సేన్ పీరా, నగేష్ గుజ్జల, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి, అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు అమర్నాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
APRTCRTCSaveRTCStopRTCPrivatisationPPPModelPublicTransportAndhraPradeshAPPoliticsYSRCPTradeUnionsRTCEmployeesPublicService
ఆర్టీసీలో పీపీపీ విధానం అన్యాయం.. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఖండించిన వైసీపీ నేతలు - Tholi Paluku