Let's talk: editor@tmv.in
నెవాడాలో శక్తివంతమైన భూకంపం
నెవాడాలో శక్తివంతమైన భూకంపం
నెవాడాలో శక్తివంతమైన భూకంపం

నెవాడాలో శక్తివంతమైన భూకంపం

Dantu Vijaya Lakshmi Prasanna
15 ఏప్రిల్, 2026

అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో, కార్సన్ సిటీ సమీప గ్రామీణ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 5.7 తీవ్రత గల భూకంపం సంభవించింది. అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం సాయంత్రం 6:30 గంటలకు ముందు చోటుచేసుకుంది. సిల్వర్ స్ప్రింగ్స్ పట్టణానికి తూర్పున 20.7 కిలోమీటర్ల దూరంలో, భూమికి కేవలం 5 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తక్కువ లోతులో భూకంపం రావడం వల్ల దాని ప్రభావం తీవ్రంగా ఉంది.

దెబ్బతిన్న వాణిజ్య సముదాయాలు

భూకంపం ధాటికి ఫాలన్ పట్టణంలోని పలు వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయి. ఒక కిరాణా దుకాణంలోని దృశ్యాలను గమనిస్తే, అద్దాలు పగిలిపోయి, తినుబండారాలు ఇతర వస్తువులు నేలపాలై చిందరవందరగా పడి ఉన్నాయి. భూకంపం సంభవించిన సమయంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు ఒక నిమిషం పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్థానిక ఫాలన్ నివాసి ట్రినా ఎన్‌లో తన అనుభవాన్ని వివరించారు. ఆమె తన కుమార్తెతో కలిసి ఇంట్లో హోంవర్క్ చేస్తుండగా అకస్మాత్తుగా భూకంపం సంభవించిందని తెలిపారు. “భూకంపం రావడానికి ముందే ఒక గర్జన శబ్దం వినిపించింది. వెంటనే ఇల్లు మొత్తం కంపించడం ప్రారంభమైంది,” అని ఆమె చెప్పారు. దాదాపు ఒక నిమిషం పాటు ప్రకంపనలు కొనసాగాయని, ఈ ప్రకంపనల వల్ల ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కింద పడిపోయినప్పటికీ, అదృష్టవశాత్తూ ఇంటి గోడలకు ఎటువంటి పగుళ్లు రాలేదని, ఆమె నివాసానికి పెద్దగా నష్టం జరగలేదని ఆమె వెల్లడించారు. అయితే సమీప ప్రాంతాల్లో కొంతమేర నష్టం జరిగినట్లు సమాచారం.

ప్రభుత్వ హెచ్చరికలు

ఈ భూకంపం వల్ల సమీప ప్రాంతాల్లోని ప్రజలు "బలమైన నుండి అతి బలమైన" ప్రకంపనలను అనుభవించినట్లు అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ పేర్కొంది.. కొన్ని చోట్ల స్వల్పంగా మరికొన్ని చోట్ల మధ్యస్థంగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలు, సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. మరోపక్క తదుపరి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఈ ఘటనపై వాషింగ్టన్ నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి నివేదికలు అందలేదు. గ్రామీణ ప్రాంతం కావడంతో జనసాంద్రత తక్కువగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, ఇతర అత్యవసర సేవలను పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయి.