
విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4.60కు తగ్గించాలి: ఏపీ సీఎం
రాష్ట్రంలో ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని మరింత తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం యూనిట్‌కు రూ. 4.90గా ఉన్న కొనుగోలు ధరను ఈ ఏడాది చివరి నాటికి రూ.4.60కి తీసుకురావాలని ఆయన లక్ష్యంగా నిర్దేశించారు. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా ప్రయోజనాలే పరమావధిగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో అత్యాధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ అందించడంపై నిరంతర అధ్యయనం జరగాలని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన ఆవిష్కరణలను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇక రాష్ట్రంలో వేసవి వేడి నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకు 6,397 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైందని గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం అధికమని తెలిపారు. పారిశ్రామిక అవసరాలు వేసవి తాపం కారణంగా రోజువారీ డిమాండ్ 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నామని 2025 ఏప్రిల్‌లో రూ. 5.20గా ఉన్న ధరను ఇప్పటికే రూ. 4.90కి తగ్గించామని వెల్లడించారు.
పునరుత్పాదక ఇంధనంపై దృష్టి
పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2028-29 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర మొత్తం విద్యుత్ అవసరాల్లో సగానికి పైగా పునరుత్పాదక ఇంధనం ద్వారానే అందాలి అని లక్ష్యాన్ని విధించారు. ఇందుకోసం పంప్డ్ స్టోరేజ్ విధానంపై సమగ్ర అధ్యయనం చేయాలని ఎనర్జీ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిశోధనల కోసం ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలు తమ సీఎస్సార్ నిధులను వినియోగించాలని అవసరమైతే ప్రభుత్వం అదనపు బడ్జెట్ కేటాయిస్తుందని హామీ ఇచ్చారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ అమలుపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు 52,396 సోలార్ రూఫ్‌టాప్ కనెక్షన్లు ఇవ్వగా ఇకపై నెలకు 2 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.ఇక పీఎం కుసుమ్ ఇప్పటి వరకు 2.94 లక్షల కనెక్షన్లు ఇచ్చామని మొదటి విడతను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఛార్జింగ్ స్టేషన్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలని ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ట్రాన్స్‌కో, జెన్‌కో మరియు డిస్కంల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
