


నగరంలో కాలుష్యానికి చెక్.. పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటకే: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అంతర్భాగాన్ని పూర్తిగా కాలుష్య రహిత ప్రాంతంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 2,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ కోర్ అర్బన్ ప్రాంతంలో 1.35 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, సుస్థిరమైన హైదరాబాద్‌ను అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం యూనిట్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ విభాగాలను పరిశీలించిన ఆయన, సంస్థ అభివృద్ధి చేసిన సోలార్ ఆక్సీ ట్రీ, సోలార్ ఆధారిత వీధి దీపాలు, గాలి శుద్ధి వ్యవస్థ వంటి వినూత్న ఉత్పత్తులను కూడా పరిశీలించారు.
మెట్రో నగరాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం, ట్రాఫిక్, అనియంత్రిత నగరీకరణ వంటి సమస్యలతో సతమతమవుతున్నాయని చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆ నగరాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
ఆ నగరాల అనుభవాల నుంచి తెలంగాణ ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటోందని, హైదరాబాద్ విషయంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటి నుంచే దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తున్నామని వివరించారు.
కాలుష్యానికి చెక్... పరిశ్రమలు ఓఆర్ఆర్ బయటకు
హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలోని జీడిమెట్ల, బాలానగర్ వంటి పరిశ్రమల ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్యం, అలాగే మూసీ నది కాలుష్యం కారణంగా నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకే ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే పరిశ్రమలను దశలవారీగా ఓఆర్ఆర్ వెలుపల ఉన్న పెరి అర్బన్ ఎకానమీ ప్రాంతంలోని మాన్యుఫాక్చరింగ్ జోన్‌కు తరలించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
తరలించే పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు, అనుమతులు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు.
మొదటి పరిశ్రమగా ప్రీమియర్ ఎనర్జీస్‌కు ప్రశంసలు
మాన్యుఫాక్చరింగ్ జోన్‌లో తొలి పెద్ద పరిశ్రమగా ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ ప్రారంభం కావడం ఆనందకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేవలం 12 నెలల వ్యవధిలోనే అత్యాధునిక తయారీ యూనిట్‌ను నిర్మించడం సంస్థ సామర్థ్యానికి నిదర్శనమని ప్రశంసించారు.
సౌర విద్యుత్ రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఇలాంటి పెట్టుబడులు మరింతగా రావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రైజింగ్-2047తో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన "తెలంగాణ రైజింగ్-2047" విజన్ ప్రకారం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లుగా విభజించి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
బ్లూ కాలర్ ఉద్యోగాలపై యువత దృష్టి పెట్టాలి
భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు.
వైట్ కాలర్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా పరిశ్రమల్లో లభించే బ్లూ కాలర్ ఉద్యోగాలను కూడా యువత అందిపుచ్చుకునేలా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్స్ యూనివర్సిటీ వంటి వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని వివరించారు.
ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలంటే ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే సరిపోవని ముఖ్యమంత్రి అన్నారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు.
2047లో దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల సమయానికి తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుందో గర్వంగా చెప్పుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కాలుష్య నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యం
పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సోలార్ శక్తితో పనిచేసే ఆక్సిజన్ పంపింగ్, గాలి శుద్ధి వ్యవస్థలను అభివృద్ధి చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థను ముఖ్యమంత్రి అభినందించారు.
అయితే కాలుష్యాన్ని నియంత్రించడానికి కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోదని, ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సంపూర్ణ సహకారం కూడా అత్యంత అవసరమని పిలుపునిచ్చారు.
అధికారాన్ని కోల్పోయిన బాధను, అసహనాన్ని ప్రతిరోజూ ప్రజలపై, ప్రభుత్వంపై చూపకుండా ప్రతిపక్ష పార్టీలు కొంతకాలం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా పనిచేయనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పోరాటం చేసుకోవచ్చని, కానీ ప్రజలు ఐదేళ్లపాటు పాలించే బాధ్యతను తమ ప్రభుత్వానికి అప్పగించిన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్ సలూజా, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సింగ్ సలూజా, డైరెక్టర్ సుధీర్ మూల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవతి రోహిణి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
