
కాలుష్యరహిత పుష్కరాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గోదావరి నదిని కలుషితం చేస్తున్న మురుగు, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలను అరికట్టేందుకు తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించి కీలక నియామకాలు, ఆదేశాలు జారీ చేశారు.
పుష్కరాల నిర్వహణ నిమిత్తం గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల పరిధిలో 262 పుష్కర పంచాయతీలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాల్లోని మురుగునీరు నేరుగా నదిలోకి ప్రవహించకుండా ‘వీబీ జీ రాం జీ’ పథకం కింద మ్యాజిక్ డ్రెయిన్లు, సామాజిక ఇంకుడు గుంతలు, ఇండివిడ్యువల్ ట్విన్ పిట్స్ నిర్మించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 8.38 మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తోందని, దీనిని అడ్డుకోవడానికి పంచాయతీ సిబ్బందితో నిరంతర పర్యవేక్షణా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు వెల్లడించాయి. మున్సిపాలిటీలు, గ్రామాలు, పరిశ్రమలు, ఆక్వా యూనిట్ల నుంచి భారీగా మురుగు నీరు నదిలో కలుస్తోంది. ఆరు జిల్లాల పరిధిలోని పట్టణ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 104 మిలియన్ లీటర్ల మురుగు విడుదల అవుతుండగా, గ్రామీణ ప్రాంతాల నుంచి మరో 8.38 మిలియన్ లీటర్ల మురుగు చేరుతోంది. ఆంధ్ర పేపర్స్ పరిశ్రమ ఒక్కటే రోజుకు 32 మిలియన్ లీటర్ల వరకు పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేస్తుండగా, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం గోదావరిలో కలుస్తోంది.
మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం – రూ. 100 కోట్ల నిధులు
పట్టణ వ్యర్థాలను అరికట్టడానికి ప్రతి మున్సిపాలిటీ పరిధిలో సామర్థ్యానికి తగినట్లుగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇందుకోసం కాలుష్య నియంత్రణ మండలి మంజూరు చేసిన రూ. 100 కోట్ల నిధులతో పాటు, అవసరమైతే స్వచ్ఛాంధ్ర, వీబీ జీ రాం జీ నిధులను దశలవారీగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, పరివాహక మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన నిషేధం అమలు చేయాలన్నారు.
ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్
కాలుష్య నివారణ చర్యలను నిరంతరం పర్యవేక్షించడానికి ఆర్టీజీఎస్ తరహా అత్యాధునిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సీసీ కెమెరాల అనుసంధానంతో ప్రాంతాల వారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసి, పరిశ్రమల మురుగునీటి విడుదలపై నిఘా ఉంచాలన్నారు. పరిశ్రమలు ఆధునిక సాంకేతికతతో కూడిన ఈటీపీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా పీసీబీ తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన ‘పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్’ కు అప్పగిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. భక్తులంతా స్వచ్ఛమైన గోదావరి జలాల్లో పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేలా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
