
‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. మంత్రి కొండా సురేఖపై బీజేపీ ఫైర్
తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల పై రాష్ట్ర బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమావేశాలు నిర్వహించి “జై శ్రీరామ్” నినాదాలు చేయడం తప్ప, కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తీసుకురావడంలో వారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు.
మంగళవారం వరంగల్లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఆమె, ఎన్నికల హామీల గురించి బీజేపీకి మాట్లాడే హక్కు లేదన్నారు. “వాళ్లు సభలు పెట్టి ‘జై శ్రీరామ్’ అంటారు. అలా చెప్పడం వల్ల పై నుంచి రాష్ట్రానికి నిధులు వస్తాయా? పథకాలు వస్తాయా? ఏమీ రావడం లేదు. ప్రధాని వస్తారు, హిందీలో ప్రసంగించి వెళ్లిపోతారు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద నిధులు సాధించడంలో చురుకుదనం చూపడం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా వారు మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు.
బండి సంజయ్ తీవ్ర స్పందన
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హిందుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ఇకపై చెల్లదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలు ప్రస్తావించారు. గతంలో శబరిమల, సనాతన ధర్మం, తిరుమల వంటి అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పినరయి విజయన్, స్టాలిన్, మమతా బెనర్జీ, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ వంటి నేతలకు ఓటర్లు తమదైన శైలిలో సమాధానం చెప్పారని ఆయన గుర్తుచేశారు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కూడా 'జై శ్రీరామ్' నినాదాన్ని డబ్బుతో ముడిపెడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల కలిగే పరిణామాలు ఇప్పటికే కనిపిస్తున్న ట్రెండ్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు" అని సంజయ్ వ్యాఖ్యానించారు. హిందువుల విశ్వాసాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదని, ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కాదు.. దైవద్రోహ శాఖ మంత్రి అంటూ బీజేపీ ఫైర్
‘జై శ్రీరామ్’ నినాదాన్ని పైసలతో పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా కాకుండా "దైవద్రోహ శాఖ మంత్రి"గా వ్యవహరిస్తున్నారని బీజేపీ విమర్శించింది.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని అపహాస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన అసలు నైజాన్ని బయటపెట్టుకుందని బీజేపీ ఆరోపించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను కించపరచడం దుర్మార్గమని పేర్కొంది. పవిత్రమైన శాఖకు మంత్రిగా ఉండి దైవాన్నే అవమానించిన కొండా సురేఖకు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని మండిపడింది. శ్రీరాముడిని కించపరిచినందుకు గాను మంత్రి కొండా సురేఖ తక్షణమే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. హిందూ ధర్మంపై కాంగ్రెస్ నాయకులకు ఉన్న చులకన భావానికి ఈ అహంకారపూరిత మాటలే నిదర్శనమని ధ్వజమెత్తింది. మొత్తానికి, నిధుల వ్యవహారం కాస్తా ఇప్పుడు భక్తి, రాజకీయ నినాదాల చుట్టూ తిరుగుతూ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది.
