Let's talk: editor@tmv.in
తెలంగాణలో రాజకీయ హైడ్రామా..కుంభకోణాలు, అప్పులపై బహిరంగ చర్చకు సవాళ్లు!
తెలంగాణలో రాజకీయ హైడ్రామా..కుంభకోణాలు, అప్పులపై బహిరంగ చర్చకు సవాళ్లు!
తెలంగాణలో రాజకీయ హైడ్రామా..కుంభకోణాలు, అప్పులపై బహిరంగ చర్చకు సవాళ్లు!
తెలంగాణలో రాజకీయ హైడ్రామా..కుంభకోణాలు, అప్పులపై బహిరంగ చర్చకు సవాళ్లు!

తెలంగాణలో రాజకీయ హైడ్రామా..కుంభకోణాలు, అప్పులపై బహిరంగ చర్చకు సవాళ్లు!

Dantu Vijaya Lakshmi Prasanna
3 జులై, 2026

తెలంగాణ రాజకీయాల్లో గురువారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ టెండర్లలో అవినీతి ఆరోపణలు, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పరస్పరం బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకోవడంతో హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం రాజకీయ కేంద్రంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ మంత్రులు చర్చకు సిద్ధమని అక్కడికి చేరుకోగా, మరోవైపు బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

గురుకుల టెండర్లపై చర్చకు కాంగ్రెస్ మంత్రుల రాక

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల టెండర్లలో రూ.2,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు ఆయన అధికార పక్షాన్ని సవాల్ చేయడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ కలిసి శాసనసభ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపానికి చేరుకున్నారు.

అక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. మొత్తం టెండర్లు రూ.1143 కోట్లు అయితే రూ.2,000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు టెండర్ల మొత్తం విలువే అంత మొత్తంలో లేదని స్పష్టం చేశారు. ప్రజల చేత ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, కానీ ఇతరులతో చర్చించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా బహిరంగ చర్చలో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి అమరవీరుల స్మారక స్థూపానికి బయలుదేరారు. అయితే తెలంగాణ భవన్ బయటే భారీగా మోహరించిన పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకుని ముందుకు వెళ్లనీయలేదు.

ఈ సందర్భంగా కారులో నుంచే మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. తాను అక్కడికి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహ్మద్ అజహరుద్దీన్‌లకు ఫోన్ చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆరోపించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండగా, తాను కాలినడకన అయినా అమరవీరుల స్మారక స్థూపానికి వెళ్తానని హరీశ్ రావు ప్రకటించారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబితే తనను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వానికి ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర అప్పులపై జూపల్లి-కేటీఆర్ మధ్య సవాళ్లు

ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర అప్పుల అంశం కూడా రాజకీయ వేడిని మరింత పెంచింది. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అమరవీరుల స్మారక స్థూపానికి చేరుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌తో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

కేటీఆర్ ఇటీవల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అప్పులు కేవలం రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండించిన జూపల్లి కృష్ణారావు.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రత్యక్ష, పరోక్ష అప్పులు కలిపి సుమారు రూ.8 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై పడిందని ఆరోపించారు.

జూలై 1న కూడా ఈ అంశంపై అవసరమైతే బీఆర్ఎస్ కార్యాలయానికే వచ్చి చర్చిస్తానని జూపల్లి ప్రకటించారు. అయితే గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తాను చర్చ కోసం సిద్ధంగా వేచి ఉన్నప్పటికీ జూపల్లి కృష్ణారావు అక్కడికి రాకపోవడంతో వెనక్కి తగ్గినట్టేనని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి సవాల్

జూన్ 30న రైతుబంధు పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా ఈ రాజకీయ వివాదంపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ గత 30 నెలల పాలన, బీఆర్ఎస్ పదేళ్ల పాలన, అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ఒకే వేదికపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

బండి సంజయ్ విమర్శలు

ఈ పరిణామాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఈ వ్యవహారం 'బిగ్‌బాస్' రియాలిటీ షోను తలపిస్తోందని ఎద్దేవా చేశారు.

కెమెరాల ముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా, అసలు విషయానికి వస్తే రెండు పార్టీలు పరస్పరం ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని ఆరోపించారు.

"ఈ రాజకీయ నాటకాలు చాలా అయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో బహిరంగ ప్రజా చర్చ ఏర్పాటు చేయాలని కోరుతాను. గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, అవినీతి, పాలనా వైఫల్యాలపై ఈ రెండు పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే" అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషిని కూడా బీజేపీ వాస్తవాలతో ప్రజల ముందుంచుతుందని తెలిపారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు "డబుల్ ఎలిమినేషన్" ఇచ్చి, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఉద్రిక్తంగా ముగిసిన రాజకీయ పోరు

గురువారం జరిగిన ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ మంత్రులు అమరవీరుల స్మారక స్థూపం వద్ద చర్చకు సిద్ధమని ప్రకటించగా, బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరకుండా పోలీసులు అడ్డుకోవడం రాజకీయ వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు కొనసాగుతుండగా, ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరికొంతకాలం చర్చనీయాంశంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్‌లు
TelanganaPoliticsCongressBRSHarishRaoRevanthReddyKTRPonnamPrabhakarTelanganaNewsHyderabadNewsPoliticalDebateGurukulTendersCorruptionAllegationsTelanganaDebtPoliticalDramaBreakingNewsTelanganaAssemblyBRSvsCongressTeluguNews
తెలంగాణలో రాజకీయ హైడ్రామా..కుంభకోణాలు, అప్పులపై బహిరంగ చర్చకు సవాళ్లు! - Tholi Paluku