
పోలీసు వ్యవస్థను రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నారు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం పౌరులకు కల్పించిన వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిదని జగన్ గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాథమిక హక్కుపై వ్యవస్థ బద్ధంగా దాడి చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై విమర్శించే వారిపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తూ కఠిన చట్టాలను ప్రయోగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అణిచివేతపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు, వీడియోలను సాకుగా చూపి రాజకీయ ప్రేరిత ఫిర్యాదులతో వెంటనే ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కంటెంట్‌ను తొలగించాలని సంబంధిత ఖాతాలను నిలిపివేయాలని పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపడం.. ప్రజాభిప్రాయాన్ని నియంత్రించే కుట్రలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
వైసీపీ కార్యకర్తలు, జర్నలిస్టులు, సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. మరోవైపు వైసీపీ నేతలపై జరుగుతున్న దూషణలు, తప్పుడు ప్రచారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. భయానక వాతావరణంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని పోలీసులను రాజకీయ ఆయుధాలుగా మార్చడం తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
