
పోలీస్ నియామకాలు చేపట్టాలి: డీజీపీకి వినతిపత్రం
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ని హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకుడు అనుగుల రాకేష్ రెడ్డి మంగళవారం కలిశారు. నిరుద్యోగ జేఏసీ, పోలీస్ అస్పిరెంట్ల బృందంతో కలిసి వెళ్లిన ఆయన.. పోలీస్ ఉద్యోగార్థుల డిమాండ్లతో కూడిన వినతిపత్రంను డీజీపీకి సమర్పించారు.
రాష్ట్రంలో తక్షణమే ఖాళీగా ఉన్న 19 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. అలాగే ఉద్యోగార్థుల వయోపరిమితిని పెంచాలని, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 ఏళ్లు, ఎస్సై అభ్యర్థులకు 38 ఏళ్ల వరకు వయోపరిమితిని సవరించాలని కోరారు. వీటితో పాటు వివాదాస్పద జీవో 46 ను రద్దు చేసి, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వినతిపత్రంపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు రాకేష్ రెడ్డి తెలిపారు. ఈ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
