Let's talk: editor@tmv.in
‘పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్’.. క్షేత్రస్థాయిలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ తనిఖీలు

‘పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్’.. క్షేత్రస్థాయిలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ తనిఖీలు

Gaddamidi Naveen
17 జూన్, 2026

వర్షాకాలంలో విద్యుత్ సరఫరా అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో టీజీఎస్పీడీసీఎల్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రత్యేక కార్యక్రమం ‘పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ – వాక్ అలాంగ్ ది లైన్’ రెండో రోజు తనిఖీలు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని ఆనంద్‌నగర్ కాలనీలో నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ స్వయంగా పాల్గొని ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లైన్ టు లైన్ సర్వే నిర్వహించిన సీఎండీ, విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలు, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు, జంపర్లు, సర్వీస్ కనెక్షన్లు తదితర మౌలిక సదుపాయాల స్థితిగతులను సమగ్రంగా సమీక్షించారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన నెట్‌వర్క్ లోపాలు, పెండింగ్ మరమ్మతు పనులు, లైన్ క్లియరెన్స్ సమస్యలు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. అలాగే, విధి నిర్వహణలో డ్రస్ కోడ్‌ను కచ్చితంగా పాటించడంతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), లైన్ టూల్స్, ఇతర భద్రతా సామగ్రిని తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు.

వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు ఫీడర్లు, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు, ఎల్‌టీఈ, హెచ్‌టీఈ నెట్‌వర్క్‌ల నిర్వహణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ క్లియరెన్స్, ముందస్తు నిర్వహణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసి నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని అధికారులను ఆదేశించారు.