Let's talk: editor@tmv.in
నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావాలి: అధికారులకు పురందేశ్వరి సూచన

నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావాలి: అధికారులకు పురందేశ్వరి సూచన

Panthagani Anusha
25 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన ఆమె అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని, డయాఫ్రం వాల్‌తో పాటు ఇతర కీలక విభాగాల పనితీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆమె సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌లో ఇంకా పూర్తి చేయాల్సిన కీలక అంశాలు, సాంకేతిక సవాళ్లు పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చేపడుతున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వరదలు వచ్చే లోగా పూర్తి చేయాల్సిన అత్యవసర పనుల స్థితిగతులను పురందేశ్వరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే పనుల వేగం

సమీక్ష అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి దీని నిర్మాణానికి అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు సమకూరుస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పూర్తి స్థాయి సహకారం వల్లే ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఈ ప్రాజెక్ట్ సాకారమైతే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక అంశాలు మిగిలిన పనుల పూర్తి స్థితిపై అధికారులతో ప్రత్యేక కార్యాచరణను చర్చించినట్లు పురందేశ్వరి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో జాప్యం జరగకుండా మరింత వేగాన్ని పెంచేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు, ప్రధాని మోదీ ప్రత్యేక చొరవతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ కృషితో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కానుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీరు, తాగునీరు మరియు ఆర్థిక రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తుందని పురందేశ్వరి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.