Let's talk: editor@tmv.in
కేంద్ర మంత్రి సంజయ్ కుమారుడిపై 'పోక్సో' కేసు

కేంద్ర మంత్రి సంజయ్ కుమారుడిపై 'పోక్సో' కేసు

Gaddamidi Naveen
10 మే, 2026

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తీవ్రంగా ఖండించారు. తనను డబ్బుల కోసం వేధిస్తున్నారని, నేరపూరిత బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులపై ఆయన ఫిర్యాదు చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం, 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో భగీరథ్‌ తన కుమార్తెను లైంగికంగా వేధించాడని పేర్కొన్నారు. భగీరథ్‌ ఆ బాలిక మధ్య సుమారు ఏడు నుంచి ఎనిమిది నెలల క్రితం పరిచయం ఏర్పడి, అది స్నేహంగా కొనసాగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలిక విద్యార్థిని కావడంతో ఆమె వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న భగీరథ్

ఇదిలా ఉండగా, భగీరథ్‌ కరీంనగర్ పోలీసులకు వేరుగా ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో, పరిచయం అయిన బాలిక తనను కుటుంబ కార్యక్రమాలు, స్నేహితుల సమావేశాలకు ఆహ్వానించేదని పేర్కొన్నాడు. ఆ కుటుంబాన్ని నమ్మి తాను వారితో కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లినట్లు తెలిపాడు.

తరువాత బాలికతో వివాహం చేసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని భగీరథ్‌ ఆరోపించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భయంతో బాలిక తండ్రికి రూ.50 వేల రూపాయలు ఇచ్చానని, అయినప్పటికీ తరువాత రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని భగీరథ్‌ ఆరోపించాడు. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే బాలిక తల్లి ఆత్మహత్య చేసుకుంటానని తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇరువైపుల ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తూ, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.