Let's talk: editor@tmv.in
ప్రధాని ప్రసంగం కోడ్ ఉల్లంఘన కాదు: విపక్షాల ఆరోపణలపై బీజేపీ కౌంటర్

ప్రధాని ప్రసంగం కోడ్ ఉల్లంఘన కాదు: విపక్షాల ఆరోపణలపై బీజేపీ కౌంటర్

Gaddamidi Naveen
22 ఏప్రిల్, 2026

ప్రధాన మంత్రి ప్రసంగంపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన ఆరోపణలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎంసీసీ ఉల్లంఘించలేదని రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా ఓట్లు వేయమని విజ్ఞప్తి చేయలేదని, కేవలం విపక్షాల తీరును ఎండగట్టారని ఆయన పేర్కొన్నారు.

లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై సీపీఐ ఎంపీ పి. సంతోష్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రజలను ఓట్లు అడగలేదు. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్, ఇండియా కూటమి చేసిన ద్రోహాన్ని మాత్రమే ఎండగట్టారు. మహిళలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు తప్ప, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదు అని ఆయ‌న‌ వివరించారు. ప్రధాని సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో భయపడిన విపక్షాలు, కొంతమంది మేధావుల ముసుగులో ఇటువంటి ఫిర్యాదులు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వీరిలో కొందరు 'అర్బన్ నక్సల్స్' కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.

సీపీఐ నేత ఆరోపణలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ ప్రభుత్వ అధికారిక ప్రసార మాధ్యమాలైన దూరదర్శన్, సంసద్ టీవీలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని సీపీఐ నేత సంతోష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ తన విజయాలను ప్రచారం చేసుకునేందుకు ప్రభుత్వ మీడియాను వాడకూడదన్న నిబంధనను ప్రధాని ఉల్లంఘించారని ఆయన వాదించారు.

ప్రధాని మోడీ వ్యాఖ్యలు

గత శనివారం ప్రధాని మాట్లాడుతూ.. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోవడం మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. మహిళలు దేన్నైనా మరచిపోవచ్చు కానీ, తమ గౌరవానికి జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మరచిపోరు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు చేసిన ఈ పాపానికి ప్రజలే వారికి తగిన శిక్ష విధిస్తారని ప్రధాని హెచ్చరించారు. ప్రధాని ప్రసంగం కేవలం బాధ్యతాయుతమైన సమాచార సేకరణే తప్ప, రాజకీయ ప్రచారానికి సంబంధించింది కాదని బీజేపీ తన వాదనను బలంగా వినిపిస్తోంది.