
భారతీయుల మృతిపై ప్రధాని మౌనం: ఎంపీ అసదుద్దీన్
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబరాలు చేసుకోవడానికి సమయం ఉంటుంది కానీ, అమెరికా దాడిలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఖండించడానికి మాత్రం సమయం లేదని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే భారతీయ నావికుల ప్రాణాలను రక్షించడంలో మోడీ ప్రభుత్వం పదేపదే విఫలమవుతోందని మండిపడ్డారు.
ఈ విషయమై ఆయన గురువారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. భారతీయుల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. దేశ ప్రధానికి వేడుకలకు సమయం ఉంది, భారతీయులను చంపిన అమెరికా సైన్యాన్ని ఖండించడానికి సమయం లేకపోవడం అత్యంత విచారకరం, బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రలో ఇంతకంటే బలహీనమైన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా అని ఓవైసీ ప్రశ్నించారు. రష్యా దేశం ఇప్పటికీ భారతీయులను సైనికులుగా చేర్చుకుంటూ వారి మరణాలకు కారణమవుతుంటే, మన ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. చైనా పేరును ప్రస్తావించడానికి గానీ, గాల్వాన్ లోయ యుద్ధాన్ని చూపించడానికి గానీ ఈ ప్రభుత్వం సినిమాలను అనుమతించడం లేదని.. ఇప్పుడు అంతర్జాతీయ జలాల్లో భారతీయ నావికులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఆరోపించారు. ఒక దేశంగా మనం ఇంతకంటే మెరుగైన పాలనకు అర్హులమంటూ ఆయన 'జై హింద్' తో తన పోస్ట్‌ను ముగించారు.
గడిచిన నాలుగు రోజుల్లో ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మూడు వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేసిందని, ఈ ఘటనల్లో ముగ్గురు భారతీయ పౌరులు మరణించారని గురువారం కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్లినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ఇలాంటి దాడులు వెంటనే నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది.
