Let's talk: editor@tmv.in
ప్రధాని ‘మా క్యాంటీన్’కు రావాలి: టీఎంసీ

ప్రధాని ‘మా క్యాంటీన్’కు రావాలి: టీఎంసీ

Pinjari Chand
26 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రత్యేక ఆహ్వానం పలికింది. రాష్ట్ర ప్రభుత్వ ‘మా క్యాంటీన్’లో రూ.5కే లభించే భోజనం రుచి చూడాలని టీఎంసీ సూచించింది. పార్టీ ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ, బెంగాల్ పర్యటనలో భాగంగా హూగ్లీ నదిలో పడవ ప్రయాణం చేసిన ప్రధాని, ‘ఝాల్‌మురి’ వంటి స్థానిక ఆహారాన్ని ఆస్వాదించినట్టు గుర్తుచేశారు. ప్రధాని కొంత సమయం కేటాయించి మా క్యాంటీన్‌కు వస్తే, మధ్యాహ్నం రూ.5కే అన్నం, పప్పు, కూరలతో పూర్తి భోజనం అందుతుంది. అమిత్​షాతో కలిసి ఇద్దరూ వస్తే రూ.10లో భోజనం చేయవచ్చు అని అన్నారు.

మా క్యాంటీన్‌ పథకం 2021లో ముఖ్యమంత్రి మమతా ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో క్యాంటీన్లు నడుస్తున్నాయని, రోజువారీ కూలీలు, పేదలు, నిరుపేదలకు తక్కువ ధరకే వండిన భోజనం అందిస్తున్నారని చెప్పారు. అక్రమ చొరబాట్ల అంశంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ఘోష్ స్పందించారు. ప్రతి సారి చొరబాట్ల గురించి మాట్లాడితే, అది మీ హోంమంత్రి అమిత్‌షా వైఫల్యాన్నే విమర్శించినట్లే. సరిహద్దుల భద్రత ఆయన బాధ్యత అని విమర్శించారు. హూగ్లీ నదిలో ప్రధాని చేసిన పడవ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ నీరు పరిశుభ్రంగా ఉంది కాబట్టి ఆయనకు ఆ అవకాశం లభించింది. ఢిల్లీలోని యమునా నదిలో అలాంటి పరిస్థితి ఉండదని ఘోష్ వ్యాఖ్యానించారు.

అస్సాం డిటెన్షన్‌ క్యాంపుల్లో బెంగాలీ హిందువులు

అస్సాంలో డిటెన్షన్ క్యాంపుల్లో బెంగాలీ హిందువులు లేరని చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. లక్షలాది బెంగాలీ హిందువులు అక్కడ నిర్బంధంలో ఉన్నారు. ఆ మోడల్‌ను బెంగాల్‌లో అమలు చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు అంగీకరించరని తెలిపారు. ఎన్నికల సంఘం పనితీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, పోలింగ్ ముందు ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మొత్తానికి, ఎన్నికల వేళ రాజకీయ వాగ్వాదాలు ముదురుతున్న సమయంలో టీఎంసీ ఈ ఆహ్వానం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

అమిత్ షా వ్యాఖ్యలపై కేసు వేస్తాం: మమతా బెనర్జీ

రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హింసాత్మక వ్యాఖ్యలు చేశారంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. హూగ్లీలో జరిగిన సభలో మాట్లాడిన మమతా అమిత్ షాపై లీగల్ కేసు వేయబోతున్నాం. హోంమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలిపారు. ఇది, ఎన్నికల తర్వాత టీఎంసీ కార్యకర్తలను ‘తలకిందులుగా వేలాడదీస్తాం’ అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మమతా ప్రతిస్పందించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె హోంమంత్రి ఇలా మాట్లాడటం అంగీకారయోగ్యం కాదు. ఈ విధమైన దౌర్జన్య భాషతో మీరు బెంగాల్‌లో ఎప్పటికీ గెలవలేరని అన్నారు.

ఇక శుక్రవారం అరాంబాగ్‌లో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ, టీఎంసీకి చెందిన గూండాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 29న ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే, మే 5 తర్వాత వారిని తలకిందులుగా వేలాడదీసి బుద్ధి చెప్తామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ముగిసింది. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వివరాల ప్రకారం, ఈ దశలో 91.78 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు.

ప్రధాని ‘మా క్యాంటీన్’కు రావాలి: టీఎంసీ - Tholi Paluku