
తెలంగాణలో బీజేపీ అధికారానికి ప్రధాని మోడీ సభే నాంది: ఎంపీ ఈటల రాజేందర్
ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఒక గొప్ప స్ఫూర్తినిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌లోని శుభం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, బీజేపీ అత్యంత ప్రజాస్వామికమైన పార్టీ అని, నిరంతరం ప్రవహించే సజీవ నది లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలలో కుటుంబ సభ్యులు జీవితకాలం అధ్యక్షులుగా కొనసాగుతారని, అయితే బీజేపీలో మాత్రం రెండు దఫాలకు మాత్రమే అధ్యక్ష పదవి పరిమితమవుతుందని తెలిపారు. బీజేపీ వారసత్వ రాజకీయాలకు దూరంగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే పార్టీ అని, కార్యకర్తల కమిట్‌మెంట్ పార్టీ బలమని చెప్పారు.
దేశానికి ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన గౌరవం ఉందని, అదే స్థాయిని తిరిగి తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో స్థిరమైన, అచంచలమైన పరిపాలనను అందిస్తున్న నాయకుడిగా మోడీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన తెలంగాణకు వస్తుండటం ప్రత్యేకమని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ ఇంకా అధికారంలోకి రాకపోవడం తనకు బాధ కలిగిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. గుజరాత్‌లో దశాబ్దాలుగా ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని, తెలంగాణలో కూడా అలాంటి రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం 4 లక్షల మెజారిటీతో పార్టీకి అజేయ శక్తిగా నిలిచిందని, అందులో ఎల్‌బి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యధికంగా 1.06 లక్షల మెజారిటీ ఇవ్వడం విశేషమని గుర్తు చేశారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా అత్యధిక కార్పొరేటర్ స్థానాలు ఇక్కడి నుంచే వచ్చాయని చెప్పారు. మూసి, హైడ్రా వంటి ప్రజా సమస్యలపై బీజేపీనే ముందుండి పోరాడిందని, ప్రజలే రాజకీయ నాయకులకు అసలైన వీఐపీలు అని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఎవరూ తోవ ఇవ్వరు, మనమే తోసుకొని ముందుకు వెళ్లాలి. రక్తసంబంధం కంటే పార్టీ సంబంధం బలమైనదని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మల్కాజిగిరి ప్రజల మీద ఉన్న నమ్మకంతోనే తాను అధిష్టానానికి మాట ఇచ్చానని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి బాటలు వేసే.. స్ఫూర్తినిచ్చే సభ ఇది. పరేడ్ గ్రౌండ్స్ సభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
