
మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోడీ తీరు అభినవ ఊసరవెల్లి లా ఉంది: వైఎస్ షర్మిల
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవర్తన అభినవ ఊసరవెల్లిని తలపిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. మహిళా సాధికారత పేరిట డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశాన్ని తెరపైకి తెచ్చి, అసలు రిజర్వేషన్లను కాలయాపన చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధానిపై ఘాటైన విమర్శలు చేస్తూ పలు డిమాండ్లను సంధించారు.
కపట సూత్రధారి మోడీ.. ముసలి కన్నీరు బీజేపీ
నారీ శక్తి ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చిన కపట సూత్రధారి మోదీ అని షర్మిల విమర్శించారు. 2023లోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయకుండా, ప్రతిపక్షాలపై నెపం నెట్టడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్న అసలు ద్రోహి ప్రధాని మోడీయేనని ఇప్పుడు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని బీజేపీ నేతలు "ముసలి కన్నీరు" కారుస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం విపక్షాలపై శాపనార్థాలు పెట్టడం మానుకోవాలని ఆమె హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఇవే
మహిళా సాధికారతపై ప్రధాని మోదీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి వంకలు వెతకకుండా ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో సంబంధం లేకుండానే ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంట్ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరగాలని ఇందుకు 2026 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు.
ముఖ్యంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఖచ్చితమైన జనాభా లెక్కలను తేల్చాలని ఆ గణాంకాల ఆధారంగానే డీలిమిటేషన్‌లో రిజర్వేషన్లు కేటాయించాలని ఆమె పట్టుబట్టారు. పునర్విభజన సాకుతో చిన్న రాష్ట్రాల గొంతు నొక్కకూడదని దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా కేంద్రం బాధ్యత వహించాలని షర్మిల స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని మార్చే కుతంత్రాన్ని విపక్షాలు అడ్డుకుంటే, తట్టుకోలేక ప్రధాని మహిళలను అడ్డుపెట్టుకొని మాట్లాడుతున్నారని షర్మిల విమర్శించారు. "చేతనైతే 2029 ఎన్నికల లోపు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయండి అని ఆమె సవాల్ విసిరారు.
